కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకీ లేదు

KTR Says Count The Four Year Rule And Vote For TRS - Sakshi

కట్టగట్టుకొని కూటమిగా వస్తున్నారు 

నాలుగున్నరేళ్ల పాలన చూసి ఓట్లేయండి 

హైదరాబాద్‌లో నాందేడ్‌ తరహా గురుద్వార్‌ 

సిక్కుల ఆత్మీయ సదస్సులో కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి లేకే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, కోదండరాం పార్టీలు కూటమిగా వస్తున్నాయని ఎద్దేవా చేశారు. సింహం లాంటి కేసీఆర్‌ సింగిల్‌గా వస్తున్నారని, ప్రజలంతా కూటమి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలన చూసి ఓట్లు వేయాలని కోరారు. తెలంగాణభవన్‌లో సోమవారం జరిగిన సిక్కుల ఆత్మీయ సదస్సులో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికలను దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజల మనసులు గెలిచిందన్నారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం, కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

సిక్కు సోదరులది కీలకపాత్ర.. 
‘సిక్కు సోదరులు దేశంలో ఎక్కడ ఉన్నా భారత సైన్యంలో ముందుంటూ దేశ రక్షణలో, వ్యవసాయంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నో వర్గాలకు చెందిన వారు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. సిక్కులు సహా అన్ని వర్గా ల్లోని పేదలకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం. సిక్కులకు తెలంగాణలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. కరీంనగర్‌ మేయర్‌ పదవి సిక్కు వర్గానికి చెందిన రవీందర్‌సింగ్‌కు ఇచ్చాం. నాందేడ్‌ తరహాలో నగరంలో గురుద్వార్‌ నిర్మిస్తాం’అని కేటీఆర్‌ అన్నా రు. సమావేశంలో ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, సలీం, సిక్కు ప్రతినిధి బగ్గా తదితరులు పాల్గొన్నారు.

మతసామరస్యంలో దేశానికే ఆదర్శం.. 
‘శాంతిభద్రతలు, మత సామరస్యంలో హైదరాబాద్‌ దేశానికే ఆదర్శంగా నిలిచింది. కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేయలేదు. మనిషిని మనిషిగా చూసిన ప్రభుత్వం మాది. పేదవారు ఏ వర్గంలో ఉన్నా వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో పథకాలు తెస్తున్నాం. తెలంగాణ రాకముందు ఉన్న విద్యుత్‌ సమస్యలను  కొద్ది రోజులకే అధిగమించాం. వ్యవసాయానికి, ఇళ్లకు పరిశ్రమలకు నిరంతర కరెంటు ఇస్తున్నాం. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. మహిళల రక్షణ కోసం షీ–టీమ్స్‌ ఏర్పాటు చేశాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలతో మేలు చేస్తున్నాం. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు 30 నుంచి 50% వరకు పెరిగాయి. మిషన్‌భగీర«థతో ఇంటింటికీ నల్లాతో తాగునీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 17% వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరిస్తాం. రైతులకు ఎకరానికి ఇప్పుడు ఇస్తున్న రూ.8 వేలను రూ.10 వేలకు పెంచుతాం. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3,01 6 భృతి ఇవ్వాలని నిర్ణయించాం. హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాం. వచ్చే ఏప్రిల్‌లోగా అవి పూర్తవుతాయి’అని వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top