తోడుదొంగలు ఒక్కటయ్యారు

KTR Fires On Chandrababu Naidu In Sirsilla - Sakshi

ఎవరికివారే మేనిఫెస్టో విడుదల 

మరి..అమలు చేసే బాధ్యత ఎవరిది

మాయాకూటమితో కుర్చీలాట తప్పదు

సిరిసిల్ల సభల్లో మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల: ‘ముసలి నక్క కాంగ్రెస్‌.. గుంటనక్క టీడీపీ తోడుదొంగలు ఒక్కటైండ్రు’అని మంత్రి కె.తారకరామారావు ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభల్లో కేటీఆర్‌ ప్రసంగించారు. రాష్ట్రాన్ని 50 ఏళ్లు ఏలిన కాంగ్రెస్, 17 ఏళ్లు ఏలిన టీడీపీలు ఒక్కటై ప్రజల ముందుకు వస్తున్నాయని.. వారిని నమ్మితే తెలంగాణ ఆగమైతుందని విమర్శించారు. ‘మాయాకూటమిలో రాహుల్‌గాంధీ సీట్లు ఇస్తరట.. చంద్రబాబు నోట్లు ఇస్తరట.. వీళ్లకు ఎవరు ఓట్లు వేస్తరు?’అని ప్రశ్నించారు. ఆంధ్రాపాలన వద్దని, ఆత్మగౌరవ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామని పేర్కొన్నారు. ‘బంగారు తెలంగాణ సాధన దిశగా రాష్ట్రం వేగంగా ముందుకు పోతుంటే.. మళ్లీ ఆంధ్రా నాయకులకు పెత్తనాన్ని ఇస్తామా..’అని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ఆ రెండు పార్టీలే శత్రువులన్నారు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మారాలంటే.. కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు.

మాయాకూటమి అధికారంలోకి వస్తే.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు కానిస్తడా..? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడతారని, కూటమిలో కుర్చీల ఆట తప్పదని ఎద్దేవా చేశారు. కోదండరాం మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాలుగు పార్టీలు నాలుగు మేనీఫెస్టోలు ఇస్తే.. అమలు చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారని కేటీఆర్‌ ప్రశ్నించారు.  సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రపథాన ఉందని, భవిష్యత్తులో మిగులు విద్యుత్‌లో ముందుకు వెళ్తామన్నారు. కొత్తగా 2001లో ఏర్పాటైన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల కంటే కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అన్ని రంగాల్లో ఎంతో ముందుందని కేటీఆర్‌ వివరించారు. ప్రగతి పరుగు పెట్టాలంటే మళ్లీ సీఎం కేసీఆర్‌ కావాలన్నారు. ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢిల్లీ పెత్తనానికి మధ్య యుద్ధం జరుగుతుందని, ఢిల్లీకి బానిసలు అవుతారో.. ఆత్మగౌరవంతో ముందుకెళ్తారో ఎన్నికల్లో తేల్చుకోవాలన్నారు. ఏ గట్టున ఉంటారో ప్రజలు నిర్ణయించాలని కేటీఆర్‌ కోరారు. ఈ కార్యక్రమాల్లో వేములవాడ తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్‌ పాల్గొన్నారు.
 సిరిసిల్లలో మాట్లాడుతున్న కేటీఆర్‌  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top