కేసీఆర్‌ గెలుస్తారని రాహుల్‌ తెలుసు

KTR Criticize On Congress Leaders Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : రాబోయే ఎన్నికల్లో ఎలాగూ అధికారంలోకి వచ్చేలా లేమని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాల హామీలను గుప్పిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చే హామీలు, అమలు చేసే పథకాలను రెట్టింపు చేస్తామని చెప్పడం ఒక ఊత పదంగా పెట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పలు రహదారుల వెడల్పు, ఆధునిక కూరగాయల మార్కెట్, బాలుర కళాశాల మైదానం అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేసిన మంత్రి.. దివిటిపల్లిలో నిర్మాణాలు పూర్తిచేసుకున్న 1,024 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు.

‘దేశంలో నీతిమాలిన, దిక్కుమాలిన అవార్డు ఇవ్వదలిస్తే అది కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుంది. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మోసపూరిత హామీలను గుప్పిస్తోంది. టీఆర్‌ఎస్‌ అమలు చేస్తున్న ఫించన్లను రెట్టింపు చేస్తామనడం, ఇంటింటికీ సన్నబియ్యం ఇస్తామంటూ చెబుతున్నరు. వీరి వాలకం చూస్తుంటే... ఇం ట్లో మూడు పూటలా మేం వంట చేసి తినిపిస్తామనేలా ఉన్నారు. దేశంలో, రాష్ట్రంలో 50 నుంచి 55 ఏళ్లు అధికారంలో ఉన్నరు. ఇవన్నీ ఎందుకు చేయలేకపోయిండ్రు. నాలుగేళ్లు అధికారం లేకపోయే సరికే ఇవన్నీ గుర్తొచ్చాయా?’ అని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్ని జిమ్మిక్కులు చేసిన కేసీఆర్‌ మళ్లీ గెలుస్తారని ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి కూడా తెలుసనని అన్నారు.

కేసీఆర్‌ను ఎందుకు దించాలి? 
‘కాంగ్రెస్‌ నేతలు నోరు తెరిస్తే కేసీఆర్‌ను దించేయాలంటున్నరు. ఏం.. ఎందుకు దించాలి. వృద్ధుల ఫించన్లు రూ.200 నుంచి రూ.1,000కి పెంచినందుకా? వికలాంగుల ఫించన్లు రూ.200 నుంచి రూ.1,500 చేసినందుకా? కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్లు ఇలా ఎన్నో సంక్షేమపథకాలు అమలు చేస్తుండటంతో పాటు ఏఎన్‌ఎంలు, గోపాలమిత్ర, ఆశావర్కర్లు, మహిళా సంఘాలను ఆదుకుంటున్నందుకు దించేయాలా? కాంగ్రెస్‌ నేతలు ఒక్క విషయం గుర్తించుకోవాలి. ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్ననాళ్లు కేసీఆర్‌ను ఎవరూ ఏం చేయలేరు’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటనలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌తో పాటు అధికార యంత్రాంగం పాల్గొంది.

    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top