‘సోనియా ఆరోగ్యం బాలేకపోయినా ప్రచారం చేయించారు’

KTR Comments On Congress Party Over Sonia Gandhi - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేకపోయినా తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయించారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులపై మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకుని ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యనేతలు వచ్చి ప్రచారం చేసినా.. కేసీఆర్‌ చేసిన సంక్షేమ అభివృద్ధిని ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు. 2014లో 34 శాతం ప్రజలు ఓట్లు వేస్తే.. 2018లో 44 శాతం ఓట్లు వేసి టీఆర్‌ఎస్‌ను ఆదరించారని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉండాలని ప్రజలు ఏకోన్ముఖంగా తీర్పునిచ్చారని చెప్పారు. చరిత్రలో ముందస్తు ఎన్నికలకి పోయిన వారు గెలిచింది లేదని అన్నారు. పోలైన ఓట్లలో 71 శాతం టీఆర్‌ఎస్‌కు రావడం ఆషామాషీ కాదని తెలిపారు.

‘ఎమ్మెల్యే ఎన్నికల్లో నాకోసం కష్ట పడ్డారు...ఇప్పుడు మీకోసం నేను కష్ట పడే సమయం ఆసన్నమైంద’ని అన్నారు. సిరిసిల్లలో 117 గ్రామ పంచాయతీలు, 33 వార్డులు టీఆర్‌ఎస్‌ గెలవాలని కార్యకర్తలకు సూచించారు. సర్పంచ్‌గా పోటీ చేయడానికి కాంగ్రెస్ వాళ్లు భయపడుతున్నారని అన్నారు. గంబిరావుపేట మండలం లక్ష్మీపూర్ తండాలో ఏకగ్రీవంగా గ్రామపంచాయితీకి ఎన్నికైన మంజుల అనే మహిళకు అభినందనలు తెలియజేశారు. ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో పాటు అదనంగా 15 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. లక్ష్మీపూర్ తండా స్ఫూర్తితో నియోజకవర్గంలోని అన్ని గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కావాలని, గ్రామ స్థాయి మొదలు పార్లమెంట్ వరకు గులాబీ జెండా ఎగిరితేనే.. ప్రధానిని నిర్ణయించే శక్తి టీఆర్‌ఎస్‌కు వస్తుందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top