‘మహా’ భవిష్యత్‌ నిర్ణేత కొంకణ్‌! | Konkan to decide who will rule state | Sakshi
Sakshi News home page

‘మహా’ భవిష్యత్‌ నిర్ణేత కొంకణ్‌!

Oct 12 2019 2:09 AM | Updated on Oct 12 2019 5:07 AM

Konkan to decide who will rule state - Sakshi

కొంకణ్‌, మహారాష్ట్ర

ముంబై: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొంకణ్‌ ప్రాంతం కీలకంగా మారనుంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో నాలుగో వంతు అంటే 75 సీట్లు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏర్పాటు కానున్న ననార్‌ రిఫైనరీ, ఆరే వద్ద మెట్రో కార్‌షెడ్‌ సమస్య, పీఎంసీ బ్యాంకు స్కాంలు ఈ నెల 21న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాంశాలుగా తెరపైకి వచ్చాయి. కొంకణ్‌లో ప్రధాన పోటీ బీజేపీ– శివసేన, కాంగ్రెస్‌– ఎన్సీపీల మధ్యే ఉంది. మరికొన్ని చిన్నాచితకా పార్టీలు సైతం ఉనికి కోసం ఈ ప్రాంతంలో పోరాడుతున్నాయి. కొంకణ్‌లోని మొత్తం 75 అసెంబ్లీ స్థానాల్లో ముంబైలో 29 సీట్లతోపాటు కాంగ్రెస్‌ మొత్తం 44 చోట్ల అభ్యర్థులను బరిలో నిలిపింది. ఎన్సీపీ 18 సీట్లలో పోటీకి దిగుతోంది. పొత్తులో భాగంగా శివసేన 44 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 19 నియోజకవర్గాలు ముంబైలోనివే. అధికార బీజేపీ మాత్రం ఇక్కడ 29 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఇందులో 17 స్థానాలు ముంబై పరిధిలోనివే. కొంకణ్‌ పరిధిలోకి వచ్చే ముంబైలో కూడా 36 అసెంబ్లీ స్థానాలున్నాయి.   

కీలక అంశాలపై విభేదాలు
రత్నగిరి జిల్లాలోని ననార్‌లో తలపెట్టిన రిఫైనరీ ప్రాజెక్టు గతంలో శివసేన, బీజేపీల మ«ధ్య వివాదానికి కారణమయింది. ఈ ప్రాజెక్టు కొంకణ్‌ ప్రాంతంలోని పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని శివసేన ఆరోపించడం చర్చనీయాంశమైంది. ననార్‌ రిఫైనరీని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న శివసేనను బుజ్జగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. రిఫైనరీ ప్రాజెక్టు స్థాపనను అంగీకరించేదిలేదనీ, అది ముగిసిన అంశమని శివసేన అంటోంది. ఆరే కాలనీ వద్ద నిర్మించ తలపెట్టిన కార్‌ షెడ్‌ వల్ల స్థానికంగా 2,000 చెట్ల నరికివేత అంశంపై సుప్రీంకోర్టు దాకా వెళ్లడం వివాదాస్పదమైంది. వేలాది మంది ప్రజలను నష్టాల్లో ముంచిన పీఎంసీ బ్యాంక్‌ కుంభకోణం కూడా రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. కొంకణ్‌ ప్రాంతంలోని పాల్‌ఘర్, థానే, రత్నగిరి, సింధు దుర్గ్‌ లలో శివసేన బలంగా ఉండగా, ముంబైలో బీజేపీ కీలకంగా ఉంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌తోపాటు శరద్‌పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌పార్టీ (ఎన్‌సీపీ) పట్టు కోల్పోవడం బీజేపీ, శివసేనలకు వరంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement