సాక్షి, హైదరాబాద్:  బహిష్కరణ వేటు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, ఇందులో అసెంబ్లీ స్పీకర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం పాత్ర ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. తమకు నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా  సభలో చర్చించకుండా ప్రభుత్వం అనుకున్నదే తడువుగా తమ బహిష్కరణ పూర్తి కావడం, తమ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ఎన్నికల కమిషన్‌కు వర్తమానం పంపడం  వేగంగా, ఏకపక్షంగా సాగిందని తెలిపారు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు.  నిబంధనల ప్రకారం ఇటువంటి వ్యవహారాల్లో ప్రివిలేజ్ కమిటీలో, సభలో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, స్పీకర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు.
గవర్నర్ ప్రసంగం శాసనసభ వ్యవహారాల కిందకు రాదని, ఆయన ప్రసంగ సమ యంలో ఎవరైనా సభ్యుడు హుందాగా వ్యవహరించకపోతే అతనిపై చర్యలు తీసుకునే అధికారం గవర్నర్‌కు మాత్రమే ఉందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించామంటూ తమపై స్పీకర్ బహిష్కరణ వేటు వేశారని, ఇలా చేయడం స్పీకర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించడమే కాక, రాజ్యాంగ విరుద్ధమని వివరించారు. వీరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ప్రభుత్వ వాదనల నిమిత్తం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చారు. తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతో పాటు, నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపేయడంతో పాటు, ఆ నోటిఫికేషన్ ఆధారంగా నల్ల గొండ, అలంపూర్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ గురువారం హైకోర్టులో పిటి షన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారణ జరిపారు.
ఇందులో స్పీకర్ జోక్యం తగదు..
కోమటిరెడ్డి, సంపత్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సభా వ్యవహారాల కిందకు రాని వాటి విషయంలో జోక్యం చేసుకునే అధికారం స్పీకర్‌కు లేదన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో జరిగిన దానికి స్పీకర్ చర్యలు తీసుకోవడానికి సభావ్యవహారాల నిబంధనలు అంగీకరించవన్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో ఇలాగే జరిగినప్పుడు అందుకు బాధ్యులైన సభ్యులను గవర్నరే బహిష్కరించారని తెలిపారు. నిబంధనల ప్రకారం బహిష్కరణ ఆ సెషన్‌కు మాత్రమే పరిమితం అవుతుందని, అయితే స్పీకర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వెలువరించిన తీర్పులను ఉదహరించారు. ఇటువంటి వ్యవహారాల్లో న్యాయసమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. 
తర్వాత కూడా ఉల్లాసంగానే గడిపారు
మండలి చైర్మన్ పిటిషనర్లు విసిరిన ఇయర్ ఫోన్ వల్ల గాయపడ్డారన్నది ప్రధాన ఆరోపణ అని, ఇయర్ ఫోన్ విసిరిన చాలాసేపటి వరకు మండలి చైర్మన్ ఉల్లాసంగా గడిపారని, గవర్నర్, స్పీకర్‌తో సరదాగా మాట్లాడారని,  గవర్నర్ వెళ్లేటప్పుడు కారు వరకు వెళ్లి సాగనంపారని వెంకటరెడ్డి, సంపత్ తెలిపారు. తర్వాత 20 నిమిషాలకు కన్నుకు దెబ్బతగినట్లు బ్యాండేజీ వేసుకున్నారని, మొదట కుడికన్నుకు గాయమైనట్లు చెప్పారని, ఆ తర్వాత ఎడమ కన్నుకు గాయమైందన్నారని తెలిపారు. దీని సంబంధించిన వీడియో ఫుటేజీని బహిర్గతం చేయలేదన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
