‘పౌరసత్వ’ ప్రకంపనలు: అమిత్‌ షాతో కేజ్రీవాల్‌ భేటీ..!

Kejriwal Will Meet Amit Shah Discussion On Law And Order In Delhi - Sakshi

యుద్ధ వాతావరణంగా దేశ రాజధాని

ఆందోళనలు, నిరసనలతో అట్టడుకుతున్న ఢిల్లీ

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ రాజధాని ఢిల్లీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ విద్యార్థుల నుంచి మొదలుకుని ప్రజాసంఘాలు, విపక్ష నేతల ధర్నాలు, ఆందోళనలతో హస్తిన అట్టడుగుతోంది. నిరసనకారులను నివారించేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌, టియర్‌ గ్యాస్‌ ప్రయోగం చేయాల్సి వస్తోంది. పోలీసులు, ఉద్యమకారులకు మధ్య తీవ్ర ఘర్ణణలు చోటుచేసుకుంటున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయి. ఈ నేపథ్యంలో రాజధానిలోని తాజా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో చర్చించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సిద్ధమయ్యారు. ‘ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. వర్సిటీ విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారడం దురదృష్టకరం. నిరసన పక్కదారి పట్టకుండా శాంతియుతంగా మెలగాల్సిన అవసరం ఉంది. శాంతిభద్రతలపై చర్చించేందుకు హోంమంత్రి అమిత్‌ షా సమావేశం కావాల్సిన అవసరం ఉంది’ అంటూ కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఈ మేరకు అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ను కేజ్రీవాల్‌ కోరారు.

కాగా జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారం ప్రస్తుతం బిజీగా ఉన్న అమిత్‌ షా.. ఢిల్లీ వచ్చిన అనంతరం కేజ్రీవాల్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులుపై ఇరువురు చర్చించనున్నారు. కాగా ఆగ్నేయ ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీలో ఆందోళనకారులు పలు బస్సులను తగలబెట్టడంతో హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. మంటలను ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక వాహనాలను కూడా విద్యార్థులు ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీ చార్జిలో పలువురు విద్యార్థులు, ఆందోళనకారులకు గాయాలయ్యాయి. ఒక పోలీసుకు, ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి.

కాగా, తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని విద్యార్థి సంస్థ ఎన్‌ఎస్‌యూఐ తెలిపింది. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఉద్యమంలో చేరి హింసకు పాల్పడుతున్నాయని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులు ఆరోపించారు. వర్సిటీలో ఉంటూ విద్యార్థులను రెచ్చగొడ్తున్న విద్యార్థేతరులను అదుపులోకి తీసుకునేందుకు ఆదివారం పోలీసులు జామియా మిలియా వర్సిటీలో సోదాలు జరిపారు. తాజా ఘటనపై ప్రధాని మోదీ సహా, పలువురు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హింసకు పాల్పడవద్దంటూ ప్రధాని ఆందోళకారులకు విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top