దేశంలోనే ఇలాంటి వ్యక్తులెవరూ లేరు.. ఏపీ సీఎంపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

KCR Fires On Chandrababu Naidu - Sakshi

ఏపీ హోదా కోసం లేఖ రాస్తా: కేసీఆర్‌

బాబు లీడర్‌ కాదు.. ఓ మేనేజర్‌ మాత్రమే

ఆయనో అబద్ధాల కోరు, దుర్మార్గుడు

రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతాడు

హరికృష్ణ చావునూ సొమ్ము చేసుకునేందుకు ఆయన కూతురితో పోటీ చేయించాడు

ప్రత్యేక హోదా సంజీవని కాదని.. అలా అంటే జైల్లో పెడతా అనలేదా?

ఇప్పుడు హోదా కోసం అడుగుతున్నాడు

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చి తీరతాం

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్‌ (చెత్త రాజకీయ నేత) దేశంలోనే ఎవరూ లేరని సీఎం కేసీఆర్‌ తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఈసారి చంద్రబాబుకు ఓటమి తప్పదని.. అక్కడి ప్రజలు ఆయన్ను దారుణంగా ఓడిస్తారని కేసీఆర్‌ చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో టీఆర్‌ఎస్‌ వైఖరి స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. హోదా విషయంపై అవసరమైతే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాస్తానని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఒడిశా, పశ్చిమబెంగాల్, ఢిల్లీ పర్యటనల్లో వివరాలను తెలిపేందుకు శనివారం ప్రగతి భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఐదేండ్లవుతోంది. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ సీఎం అయినా ప్రజలను దీనికి అనుగుణంగా మార్చుకోవాలి. చంద్రబాబుకు మెదడు ఉందా? అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. డిసెంబర్‌ నాటికి హైకోర్టు భవనం సిద్ధమవుతుందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది. ఏపీ హైకోర్టును ఆ రాష్ట్రానికి తరలించకున్నా హైదరాబాద్‌లోనే వేరుగా ఉంటే సరిపోతుందని మేం సుప్రీంకోర్టుకు విన్నవించాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన అఫిడవిట్‌ ప్రకారం జనవరి 1 నుంచి రెండు హైకోర్టులు మనుగడలోకి వస్తాయని సుప్రీంకోర్టు నెలన్నర క్రితం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

సుప్రీంకోర్టుకు చెప్పిన ప్రకారం ఏపీ ప్రభుత్వం డిసెంబర్‌ వరకు అమరావతిలో ఎందుకు హైకోర్టు భవనాన్ని సిద్ధం చేయలేదు. ఉమ్మడి హైకోర్టును సుప్రీంకోర్టు విభజిస్తే కేంద్రం నోటిఫై చేసింది. ఈ విషయంలో కేంద్రంపై చంద్రబాబు ఎలా విమర్శలు చేస్తాడు. ఆయనంత చెత్త రాజకీయ నేత దేశంలోనే ఎవరూ లేరు. నవీన్‌ పట్నాయక్‌ను ఎందుకు కలిసినవు. మల్లయ్యను, ఎల్లయ్యను ఎందుకు కలిసినవు అని అడుగుతడు. నేను ఎవరిని కలిస్తే నీకెందుకు? నువ్వు (చంద్రబాబు) మోదీ సంకనాకుతావు. సంకల కూచుంటవు. అకస్మాత్తుగా ఓ రోజు రాహుల్‌గాంధీ సంకనాకుతావు’అని కేసీఆర్‌ ఘాటైన పదజాలంతో విమర్శించారు. ‘చంద్రబాబుకు సిగ్గు, లజ్జ లేదు. ఇలాంటి నేతను భరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చేతులెత్తి మొక్కాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తదని ఆయనే వాదించిండు. అప్పట్లో రాహుల్‌గాంధీ విజయవాడకు వస్తుంటే.. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించిండు. ఇప్పుడు నరేంద్రమోదీ వస్తుంటే ఇదే మాట అంటున్నాడు. నీకో పాలసీ, పద్ధతి ఉందా. మనిషిలాగా మాట్లాడుతున్నావా? మీడియా ఇలాంటి డర్టీ లీడర్లను చీల్చి చెండాడాలి’అని టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 
 
పచ్చి అబద్దాలతో..  
‘ఆంధ్రప్రదేశ్‌ సచివాలయాన్ని రాఫ్ట్‌ ఫౌండేషన్‌తో నిర్మిస్తున్నారని.. దేశంలోనే ఇదే మొదటిది అని పేపర్ల నిండా ప్రకటనలు ఇచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబు గొప్పగా చెప్పారు. రాఫ్ట్‌ ఫౌండేషన్‌ టెక్నాలజీ కొత్తదేం కాదు. హైదరాబాద్‌లో వెయ్యికిపైగా ఇళ్లు ఇలాగే కట్టారు. బలహీనవర్గాలకు ప్రభుత్వం కట్టించే ఇళ్లు ఇలాగే నిర్మిస్తారు. మిషన్‌ భగీరథ కింద నిర్మిస్తున్న 18 వేల ట్యాంకులు ఇలాగే నిర్మించాం. రేగడి నేలలో ఏ నిర్మాణమైనా ఈ విధానంలోనే నిర్మిస్తారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టు ఉన్న అన్ని భవనాలను ఇలాగే కట్టారు. ఏపీ సచివాలయం 56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అసెంబ్లీ 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ సైతం పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉంది. ఏపీ సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు ఇచ్చింది. హైకోర్టు నిర్మాణం కోసం రూ.500 కోట్ల వేరుగా ఇచ్చింది. ఇవన్నీ ఏం చేశావు. నాకేశావా? ఇన్ని అబద్దాలా? ఇంత మోసమా? చంద్రబాబు అనే వ్యక్తి వాడుకుని వదిలేసే రకం. హరికృష్ణ శవంపై పేలాలు ఎరుకునే ప్రయత్నం చేశాడు. ఆయన చావును సొమ్ము చేసుకునేందుకు హరికృష్ణ కూతురును బలవంతంగా పోటీకి పెట్టారు. ఆ అమ్మాయికి ఇప్పుడైనా ఏమైనా ఇస్తరా. చంద్రబాబు నీచంగా, రాక్షసంగా వ్యవహరిస్తడు’అని కేసీఆర్‌ మండిపడ్డారు. 
 
హోదాకు టీఆర్‌ఎస్‌ అనుకూలం 
‘చంద్రబాబు కేంద్రం ఏమీ ఇవ్వలేదని అంటడు. మళ్లీ అభివృద్ధి పేరుతో శ్వేతపత్రాలు విడుదల చేస్తడు. జనం ఏది నమ్మాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని నేను వద్దన్నట్లుగా ప్రచారం చేస్తున్నడు. దీనిపై మా వైఖరి సుస్పష్టం. ప్రత్యేక హోదా ఇవ్వాలని మా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభలో మా ఎంపీ కవిత స్పష్టంగా చెప్పారు. నేనెందుకు వద్దంట. అవసరమైతే దీనిపై ప్రధానమంత్రి లేఖ రాస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని 94 సెక్షన్‌లో 1, 2 సెక్షన్లలో దీనిపై స్పష్టంగా ఉంది. రెండు రాష్ట్రాలకు పరిశ్రమల రాయితీ ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పేర్కొన్నారు. చంద్రబాబు వట్టి అబద్ధాల కోరు. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ వేణుగోపాల్‌ రెడ్డి ఇక్కడికి వచ్చి రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై అంచనాతో ప్రతిపాదనలు చేశారు. హైదరాబాద్‌ను వదులుకుంటున్నందుకు ఏపీకి పదేళ్లపాటు లోటు బడ్జెట్‌ ఉంటుందని ఆ మేరకు రూ.24 వేల కోట్లను కేంద్రం ఆ రాష్ట్రానికి ఇవ్వాలని ›ప్రతిపాదించారు. కేంద్రం దీన్ని అమలు చేస్తోంది. మళ్లీ లోటు బడ్జెట్‌ ఎక్కడ ఉంది. ఇది వాస్తవం కాదా? ఆ డబ్బులు లేవా? నీకు చేతకాదు. ప్రజా సంక్షేమం తెలియదు. అంతా అవినీతిమయం. నీకున్న ఈ జాఢ్యాల వల్లే ఇలా అయ్యింది. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నావు. అలా అంటే జైళ్లో వేస్తానన్నావు. అప్పుడు చంద్రబాబు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. నువ్వు ఒట్టి స్వార్థపరుడివి. రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారతావు. నువ్వు దుర్మార్గుడివి. ఏమీ తెలియదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం. మామ పెట్టిన పార్టీని లాక్కుని మేనేజ్‌ చేస్తున్నావు. చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదు పొలిటికల్‌ మేనేజర్‌. మేం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.

తెలంగాణ వచ్చేదాక విశ్రమించేదిలేదని అప్పటిదాకా పోరాడాం. నీలాగా చిల్లర రాజకీయాలు రావు. కేంద్రంలో బాబు చక్రాలు తిప్పలేదు. తిప్పితే ఆ అభివృద్ధి ఎక్కడ. మేనేజ్‌ చేసి పేపర్లలో ఏదో తిప్పినట్లుగా పత్రికల్లో ఫొటోలు వేసుకున్నారు. చంద్రబాబువి నకిలీ పనులు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని కాపీ కొట్టారు. కళ్యాణలక్ష్మీ పథకాన్ని అక్కడా అమలు చేస్తున్నారు. ఈవోడీపీ ర్యాంకుల ప్రతిపాదనలతో మేం పొరపాటున ఒక పదాన్ని తప్పుగా పెడితే దాన్ని కూడా ఒక్క అక్షరం మార్చకుండా అలాగే కేంద్రానికి సమర్పించారు. దీనిపై మేం కేంద్రానికి ఫిర్యాదు చేశాం. కేసు నమోదు చేశాం. ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తారు. చంద్రబాబుకు సిగ్గు లేదు. నోటికొచ్చింది మాట్లాడటమే. నీతిఅయోగ్‌ సమావేశంలో ఒకసారి మోదీని పొడిగేందుకు ఏదేదో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినందుకే రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారని అన్నాడు. అదేంటని అక్కడ ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాతో అన్నారు. పీవీ నర్సింహారావు, చరణ్‌సింగ్, దేవేగౌడ అలాగే అయ్యారు కదా అని అఖిలేష్‌యాదవ్‌ నాతో అన్నారు. చంద్రబాబు లాంటి వారిని ఇన్నాళ్లు ఎలా భరించావని నన్ను అడిగారు. ఇలా ఉంటుంది చంద్రబాబు తీరు. తెలంగాణ ఎన్నికలలోకి వచ్చిన చంద్రబాబుకు కచ్చితంగా గిఫ్ట్‌ తిరికి ఇస్తాం. జాగ్రత్త ! ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి చంద్రబాబుకు ఓటమి తప్పదు. అక్కడి ప్రజలు ఆయనను దారుణంగా ఓడిస్తారు’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 
 
రెండు బాకా పేపర్లు 
చంద్రబాబు నాయుడు ఏం చేయకున్నా ఏదో చేసినట్లుగా రెండు పత్రికలు, కొన్ని టీవీలు ప్రజలను నమ్మిస్తుంటాయని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ‘చంద్రబాబు దగ్గర రెండు, మూడు బాకా పేపర్లు ఉన్నాయి. రెండు బాకా పేపర్లు డప్పు కొట్టుడు. ఏది మాట్లాడినా ఈస్ట్‌మన్‌ కలర్‌ ఫొటోలతో కథలు వేస్తారు. చక్రం తిప్పుడు లేదు. చంద్రబాబుకు రెండు ముక్కలు ఇంగ్లీషు మాట్లాడం రాదు. కనీసం రెండు లైన్‌లు హిందీ కూడా రాదు. కేసీఆర్‌ యజ్ఞాలు చేస్తాడని మోదీ అన్నాడు. నాకు నమ్మకం ఉంది వస్తే నీకు కూడా ప్రసాదం పెడతా అన్నా. యజ్ఞ, యాగాలపై నాకు నమ్మకం ఉంది. దేవుడిపై నాకు విశ్వాసం ఉంది. యజ్ఞాలు చేస్తే నాకు మంచే అవుతోంది. నేను రాజశ్యామల యాగం చేశా. రాజశ్యామల అమ్మవారి ఆలయం విశాఖపట్నంలోనే ఉంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం భువనేశ్వర్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నా. శారదాపీఠం స్వామి వారికి ఇదే విషయం చెప్పా. విశాఖపట్నానికి రండి పూజలు చేసి భోజనం చేసి వెళ్దురు అన్నారు. నేను వెళ్లా. నేను ఊహించలేదు. అక్కడ విమానాశ్రయానికి చాలా మంది వచ్చారు. శారదాపీఠం వరకు 18 కిలోమీటర్ల దారి పొడవునా స్థానికులు నాకు ఉత్సాహంగా అభివాదం చేశారు. అభిమానంతో వచ్చారు. నేను అభివాదం చేశా. ఆ దారి పొడవునా కొందరు ఫెక్సీలు కట్టారు. ఆ రెండు బాకా పేపర్లు వైఎస్సార్‌సీపీ వాళ్లు, వెలమలు వచ్చారు అని రాశాయి. వాళ్లు ఆంధ్ర ప్రజలు కాదా. వాళ్లు ఎందుకు వచ్చారు. చంద్రబాబును తెలంగాణలో పొల్లుపొల్లు కొట్టినందుకు, తన్ని పంపించినందుకు ప్రజలలో కనిపించిన ఉత్సాహం అది. ఆంధ్రప్రదేశ్‌ వార్తలు ఇక్కడ హైదరాబాద్‌లో ఎందుకు. ప్రజలను అయోమానికి గురి చేయడానికా? తెలంగాణ ప్రాంతంగా ఉండే పేపర్లకు సహరించేలా నిర్ణయాలు తీసుకుంటాం’అని ఆయన స్పష్టం చేశారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top