6న మంత్రివర్గ విస్తరణ

Karnataka ministry expansion to take place on June 6 - Sakshi

కర్ణాటకలో ఎట్టకేలకు శాఖలపై ఏకాభిప్రాయం

2019 ఎన్నికల్లోనూ ఇరు పార్టీలూ కలిసే పోటీ

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు ముందడుగు పడింది. సంకీర్ణ ప్రభుత్వంలోని జేడీఎస్‌–కాంగ్రెస్‌ల మధ్య శాఖల పంపకంపై సయోధ్య కుదిరింది. జూన్‌ 6న కొత్త మంత్రులు ప్రమాణంచేస్తారని ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వరతో కలసి కుమారస్వామి శుక్రవారం గవర్నర్‌తో భేటీ అయిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేసి పది రోజులు పూర్తయినా కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకంపై ప్రతిష్టంభన నెలకొనడంతో మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం తెలిసిందే.

అటు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కేసీ వేణుగోపాల్‌.. కుమారస్వామి, మాజీ సీఎం సిద్దరామయ్యలతో కలసి విలేకరులతో మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వమే ముఖ్యం తప్ప మంత్రిత్వ శాఖలు కాదనీ, ఆర్థిక శాఖను జేడీఎస్‌కే ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సూచించారని వేణుగోపాల్‌ తెలిపారు. కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ మాకంటే మాకే కావాలంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లు ఇన్నాళ్లూ పట్టుబట్టడం తెలిసిందే. ఈ అంశంపై మాజీ ప్రధాని, జేడీఎస్‌ జాతీయాధ్యక్షుడు దేవెగౌడతో రాహుల్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు వేణుగోపాల్‌ చెప్పారు. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేయాలని ఇరు పార్టీలూ నిర్ణయం తీసుకున్నట్లు వేణుగోపాల్‌ స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌కు దక్కే శాఖలు
హోం, రెవెన్యూ, నీటి పారుదల, విద్య, వైద్యం, ఆరోగ్యం, బెంగళూరు నగరాభివృద్ధి, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం, అటవీ–పర్యావరణం, పరిశ్రమలు, కార్మిక, గనులు, భూ విజ్ఞాన శాస్త్రం మంత్రిత్వ శాఖలు దక్కనున్నాయి. వీటితోపాటు మహిళా–శిశు సంక్షేమం, ఆహార–పౌర సరఫరాలు, హజ్, వక్ఫ్, మైనారిటీ వ్యవహారాలు, న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, విజ్ఞాన సాంకేతికత, సమాచార సాంకేతికత, యువజన–క్రీడలు, కన్నడ సంస్కృతి శాఖలు కాంగ్రెస్‌ వద్దే ఉంటాయి.

జేడీఎస్‌కు దక్కే శాఖలు
ఆర్థిక, ఎక్సైజ్, విద్యుత్తు, నిఘా, సమాచార, ప్రణాళిక–గణాంకాలు, ప్రజా పనులు, సహకారం, పర్యాటకం, మత్స్య పరిశ్రమ, పశు సంవర్ధక శాఖ, ఉద్యాన, పట్టు పురుగుల పెంపకం, చిన్న తరహా పరిశ్రమలు, రవాణా, సూక్ష్మ నీటి పారుదల శాఖలు జేడీఎస్‌కు దక్కాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top