‘నా ముందు చంద్రబాబు బచ్చా’

Kapus shold not believe TDP - Sakshi

సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ముందు ఓ బచ్చా అని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభం ఉందని, మీరే దేశంలోనే సీనియర్ నేతను అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప.. రాష్ట్రానికి మీరు చేసింది ఏమైనా ఉందా అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. కాపు జేఏసీ కార్యాచరణ సమావేశంలో బుధవారం ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. దమ్ము, ధైర్యం ఉంటే మీ ఎంపీలతో ప్రధాని మీద నిరసన తెలుపుతూ ధర్నాలు, దీక్షలు చేపట్టాలని.. అంతేకానీ సామాన్య ప్రజలతో దీక్షలు చేపించడం సిగ్గుచేటన్నారు. గతంలో తనకు ఓటేయనుందుకు సిగ్గు పడాలన్నారు.. కానీ చంద్రబాబుకు ఓటేసినందుకు ఏపీ ప్రజలు సిగ్గు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఊపిరి ఉన్నంత వరకూ టీడీపీని నమ్మవద్దని ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం కోసం దీక్షలు చేపట్టాలన్నా, శాంతి యుతంగా నిరసన తెలపాలన్నా ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా అణచివేసిందన్నారు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైనే ధర్నాలు చేయడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ మండిపడ్డారు. రాష్ట్రం మీ ఎస్టేటా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇన్ని అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూసి ఉండరని పేర్కొన్నారు. హామీని నెరవేర్చని సీఎంను అధ:పాతాళానికి తొక్కేయాలన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకు చంద్రబాబు ప్రత్యేక హోదాను ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆరోపించారు.

చీకటి రాజకీయాలు చంద్రబాబుకు అలవాటేనన్నారు. చంద్రబాబును జీవితంలో క్షమించవద్దు. దళితులు, అణగారిన వర్గాలతో కలిసి జనపోరాటం చేయాలి. మనం ఏదైనా చేస్తే అనుమతి తీసుకోవాలంటున్నారు. మరి చంద్రబాబు సైకిల్ తొక్కడానికి, తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆందోళన చేయించడానికి ఏపీ సీఎం ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన పాపాలను ప్రజల మీద రుద్దుతున్నారని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top