డీకేపై జూపల్లి ఫైర్‌

Jupally Krishna Rao Slams Congres Leader DK Aruna In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే అరుణపై టీఆర్‌ఎస్‌ మంత్రి జూపల్లి కృష్ణా రావు మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్‌పీ ఆఫీసులో జూపల్లి శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ పార్టీ నాకు రాజకీయ భిక్ష పెట్టలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మూడు రోజులు పర్యటించిన కాంగ్రెస్‌ నేతలు అసత్య ఆరోపణలు చేశారు. తెలంగాణ ఇచ్చామని చెప్పి కూడా 2014లో కాంగ్రెస్‌ నేతలు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎందుకు ఓడిపోయారు. నేను ఎక్కడ ఉన్నా గెలిచాను. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు చేస్తున్న ద్రోహంతోనే అప్పట్లో పార్టీ వీడి టీఆర్‌ఎస్‌లో చేరాను. మహబూబ్‌నగర్‌ అభివృద్ధి తెలంగాణ ఉద్యమ గొప్పతనమే. డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టిందే నేను. నేను అవినీతి పరుడినని అరుణ సిగ్గూ శరం లేకుండా మాట్లాడుతున్నార’ ని వ్యాక్యానించారు.

ఇంకా మాట్లాడుతూ..‘ నాలుగు జన్మలెత్తినా నాపై అరుణ వేలెత్తి చూపలేరు. అరుణ భర్త భరసింహారెడ్డిపై కేసులు లేవా?. దొంగ తెలివి తేటలు అరుణ కుటుంబానికే ఉన్నాయి. నేను బ్యాంకు నుంచి నిబంధనల ప్రకారం అప్పు తీసుకున్నా..మళ్లీ కట్టేశా. నేను పులిని కాదు పిల్లి అన్నారు..అవును డీకే అరుణ కుటుంబం లాగా రక్త మాంసాల రుచి చూసే పులిని మాత్రం కాదు. సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు 3 గంటల్లో రాజీనామా చేస్తే డీకే అరుణ లాంటి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మూడేళ్లయినా రాజీనామా చేయలేదు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ నేతలు మాయమాటలు చెబుతున్నారు. యువత మీద కాంగ్రెస్‌ నేతలకు ఎక్కడ లేని ప్రేమ వస్తోంది. ఎవరూ కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు. డీకే అరుణది ఆత్మవంచన..సిగ్గు తప్పిన బతుకు’ అని ఘాటు విమర్శలు చేశారు.

‘ స్వయం కృషితో క్లర్క్‌ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగా..ఈ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నుంచి గెలుస్తా. గద్వాలలో ఏ చెట్టూ, పుట్టనడిగినా డీకే అరుణ కుటుంబం అక్రమ దందాల గురించి చెబుతాయి. కేసీఆర్‌ను దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌, టీడీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. మహబూబ్‌ నగర్‌ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో పొత్తును జిల్లా నేతలు వ్యతిరేకించకుండా సమర్ధించడం సిగ్గు చేటు. ఈ కాంగ్రెస్‌కు 20 కాదు కదా రెండు సీట్లు కూడా గెలవదు. కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు గోరీ కట్టారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సాధించిన ఫలితాలే ఈ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయి. కాంగ్రెస్‌కు బలం ఉంటే టీడీపీతో పొత్తు ఎందుక’ని సూటిగా ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top