‘గబ్బర్‌ సింగ్‌’ దుమారం

Jai Prakash Singh Expelled from BSP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/లక్నో: బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి కఠిన నిర్ణయం తీసేసుకున్నారు. అత్యంత సన్నిహితుడు, కీలక నేత  జై ప్రకాశ్‌ సింగ్‌ను పార్టీ నుంచి తొలగిస్తూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం బీఎస్పీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ‘జై ప్రకాశ్‌ సింగ్‌కు.. బీఎస్పీతో ఎలాంటి సంబంధాలు లేవు. పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉండాలి. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. మీడియా కూడా ఇకపై ఆయన వ్యాఖ్యలను బీఎస్పీకి ఆపాదించి రాయకండి’ అని సదరు ప్రకటనలో పేర్కొని ఉంది. 

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న జై ప్రకాశ్‌ సింగ్‌.. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి గబ్బర్‌ సింగ్‌ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. ప్రధానిపై వ్యాఖ్యలతో సీరియస్‌ అయిన మాయావతి.. క్రమశిక్షణ చర్యల కింద పార్టీ నుంచి ఆయన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, తన నోటి దురుసుతో జై ప్రకాశ్‌ ఈ మధ్యే పార్టీ ఉపాధ్యక్ష పదవికి దూరం అయ్యారు కూడా.  ‘వచ్చే సాధారణ ఎన్నికల్లో మాయావతే ప్రధాన మంత్రి అభ్యర్థని.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆ పదవి దక్కదని, ఎందుకంటే ఆయన తల్లి విదేశీయురాలు కావడమే కారణమని’ జై ప్రకాశ్‌ వ్యాఖ్యలు చేశారు. 

ఈ ఏడాది మూడు రాష్ట్రాల్లో(మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌) జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు బీఎస్పీ ప్రయత్నిస్తోంది. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లలో బీఎస్పీతో కలసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారటంతో వేటు తప్పలేదు. అయితే మాయావతి కుడి భుజంగా భావించే జై ప్రకాశ్‌ సింగ్‌ తొలగింపు యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top