కూపీ లాగుతున్నారు!

Jagtial District Police on AP Intelligence Survey - Sakshi

ఏపీ ఇంటెలిజెన్స్‌ సర్వేపై జగిత్యాల జిల్లా పోలీసుల ఆరా 

16 మంది నుంచి వివరాలు సేకరించిన ఎస్‌బీ డీఎస్పీ 

ముగ్గురికి టీడీపీ నేతల ఆశ్రయం

సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసుల సర్వే ఘటనపై రాష్ట్ర పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ నెల 27న ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసుల సర్వేపై మంత్రి కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ సీరియస్‌ అయ్యారు. జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పోలీసు శాఖను ఆదేశించింది. వెంటనే రంగంలో దిగిన పోలీసులు సంఘటనపై నిగ్గు తేల్చే పనిలోపడ్డారు. ఇందులో భాగంగా ఆదివారం ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో జగిత్యాల స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఆర్‌ డీఎస్పీ సీతారాములు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుదీర్ఘ విచారణ చేపట్టారు. స్థానిక టీడీపీ, టీఆర్‌ఎస్‌ నాయకులతోపాటు మొత్తం 16 మందిని విచారణ చేశారు. ధర్మపురిలో అనుమానాస్పదంగా సర్వే నిర్వహిస్తూ స్థానికులకు చిక్కిన ముగ్గురు  అసలు ఏపీ పోలీ సులేనా? ఎంత మంది వచ్చారు? ఎందుకొచ్చారు? ఎన్ని రోజులుగా మకాం వేశారు? ఎవరెవరిని కలిశారు? ఇక్కడ వారికి ఆశ్రయం కల్పించిందెవరు? ఎవరికైనా డబ్బులు పంపిణీ చేశారా? అనే కోణాల్లో విచారణ నిర్వహించారు. 

వారం రోజుల నుంచి ఇక్కడే మకాం..  
అనుమానాస్పదంగా తిరుగుతూ స్థానికులకు పట్టుబడ్డ ముగ్గురిలో ఒకరు వారం రోజులక్రితమే ధర్మపురికి వచ్చాడని.. నాలుగు రోజుల క్రితం మరో ఇద్దరు వచ్చారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. తర్వాత ముగ్గురూ భక్తులమని చెప్పుకుంటూ స్థానిక టీటీడీ ధర్మశాలలోనే మకాం వేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వీరికి స్థానిక టీడీపీ నాయకులు ఆశ్రయం కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం టీడీపీకి చెందిన పలువురిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు సర్వే చేసిన ముగ్గురికి ఎలాంటి సహకారం అందించారని ఆరా తీశారు. ఆ ముగ్గురు కొంతమందితో మాట్లాడినట్లు తెలుసుకుని ఓ హోటల్‌ యజమాని, ఇద్దరు కారు డ్రైవర్ల నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు సమాచారం. ఇందులో ఒకరు.. అనుమానాస్పద వ్యక్తి వద్ద ఓ సీల్డ్‌ కవర్‌ చూశానని చెప్పాడు. అదేంటని అడిగితే మీకు సంబంధం లేదని బదులిచ్చినట్లు ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు.  

ఆశ్రయమిస్తే తప్పేంటి?  
ఈ విషయమై టీడీపీ సీనియర్‌నేత వివరణ ఇస్తూ ‘భారత పౌరులెవరైనా, వారికి ఆశ్రయం ఇవ్వడంలో తప్పు లేదు. అయితే, వచ్చిన వాళ్లు ఇక్కడ ఏం సర్వే చేశారో మాకు తెలియదు. వారినే అడిగితే తెలుస్తుంది. మేం ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఆర్డర్‌ ఇవ్వలేదు. మాకు ఇతరులతో సర్వే చేయించుకోవాల్సిన అవసరం లేదు’ అన్నారు. 

విచారణ చేస్తున్నాం.. 
ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసుల పర్యటనపై టీఆర్‌ఎస్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మేము ఈ విషయంపై విచారణ ప్రారంభించాం. విచారణ పూర్తయితే వాస్తవాలు తెలుస్తాయి.     
– సింధుశర్మ, ఎస్పీ, జగిత్యాల

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top