తెలంగాణ ఆత్మాభిమానానికి పరీక్ష 

Harish Rao Fires on Chandrababu - Sakshi

బాబు కుట్రలను తిప్పికొట్టాలి  

లగడపాటి మోసపూరిత సర్వేలు నమ్మొద్దు  

తెలంగాణలో కొలువుదీరేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే  

సిద్దిపేట రోడ్‌షోలో హరీశ్‌రావు  

సాక్షి, సిద్దిపేట: ‘ఆరు దశాబ్దాలుగా ఎన్నో కష్టాలు, అవమానాలు భరించి పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో నేడు ఆంధ్రాపాలకుల కుట్రలతో కుమ్మక్కైన కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల కోసం వస్తోంది.. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉన్న కూటమికి ఓటేస్తారో.. రాష్ట్రాన్ని ఉద్యమం తరహాలో అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌కు ఓటేస్తారో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మాభిమానానికి పరీక్ష వంటివి’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలో ఆయన వేలాది మందితో రోడ్‌షో నిర్వహించారు. బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు. గోదావరి, కృష్ణా జలాల్లో మన వాటాను మనం తీసుకునేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆంధ్రాబాబు చంద్రబాబు చెయ్యని కుట్ర లేదని హరీశ్‌ ఆరోపించారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర పన్నిన చంద్రబాబుకు తెలంగాణ రైతుల కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు.

తెలంగాణలో కాళేశ్వరంతో పాటు పాలమూరు, ఖమ్మం, ఇతర జిల్లాల్లో నిర్మించే ప్రాజెక్టులతో రాష్ట్రం ఆకు పచ్చ తెలంగాణగా మారబోతుందన్నారు. అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతుంటే.. ఒంటరిగా పోటీ చేయడానికి భయపడిన కాంగ్రెస్‌ పార్టీ, చంద్రబాబును భుజాలపై మోసుకొని రావడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే ఉద్యోగుల విభజన, హైకోర్టు విభజనను అడ్డుకున్న చంద్రబాబుకు హైదరాబాద్‌పై మోజు తీరలేదన్నారు. పొత్తుల ముసుగులో తిరిగి తెలంగాణపై చంద్రబాబు పెత్తనం చెలాయించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలను పసిగట్టి, ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. రేపు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మారతాయని హామీ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు భాగస్వామ్యంతో ఉన్న కూటమికి ఓటేస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయా? తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు సహకరిస్తారా? మీరే ఆలోచించాలని హరీశ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.
 
లగడపాటి.. చంద్రబాబు కోవర్టు  
తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న వారిలో చంద్రబాబు కోవర్టు లగడపాటి రాజగోపాల్‌ కూడా ఒకరని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి పార్లమెంటులో ఆయన చేయని విధ్వంసం లేదని గుర్తు చేశా రు. మన రాష్ట్రం మనకు ఏర్పడి.. మన బతుకులు మనం బతుకుతుంటే మరోసారి లగడపాటి తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసత్యపు సర్వేలు, బూటకపు ప్రకటనలతో ముందుకొస్తున్న రాజగోపాల్‌ను తరిమికొట్టాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గాంధీభవన్‌ మెట్లెక్కనని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మర్నాడే మాట మార్చారన్నారు. కూటమి ఓడిపోతుందనే విషయం ఉత్తమ్‌కు ముందే తెలుసునని ఎద్దేవా చేశారు. వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని హరీశ్‌ ధీమా వ్యక్తంచేశారు. కూటమి ఓడిపోతే ఉత్తమ్‌ గాంధీభవన్‌ మెట్లెక్కకుండా కట్టుబడి ఉండాలన్నారు.  

కూటమికి ఓటేస్తే తెలంగాణ ఎడారే 
కాంగ్రెస్‌ కూటమికి ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లేనని, ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే ఆగి పోయి తెలంగాణ ఎడారిగా మారుతుందని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని క్వార్టర్‌ సీసాలు, నోట్ల కట్టలకు తాకట్టు పెట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పంపిన డబ్బులు జనగామ వద్ద దొరికిపోయాయని, మన రాష్ట్రంలో డబ్బులు పంచేందుకు తహతహలాడు తున్న చంద్రబాబు నిజస్వరూపం ఏమిటో మనకు తెలియంది కాదని అన్నారు. రాష్ట్రంపై కన్నేసిన కుట్రదారులను తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గత రెండు ఉద్యమాల్లో ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు పోరా టంలో పాల్గొన్నారని.. అదే తరహాలో ఇప్పుడు ఈ ఉద్యమంలో ఓటు ద్వారా ఆం ధ్రా కుట్రదారులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top