ఆ బాధ చంద్రబాబుకు తెలియాలనే.. 

Dwarampudi Chandrasekhar Reddy Comments On Pawan and Chandrababu - Sakshi

కాకినాడ ఘటనపై పవన్‌ వాస్తవాలు గ్రహించాలి 

ఎమ్మెల్యే ద్వారంపూడి హితవు 

కాకినాడ: ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న విమర్శల్లో ఉపయోగిస్తున్న భాష ఇప్పటికైనా మార్చుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి హితవు పలికారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రెండు, మూడు వారాలుగా చంద్రబాబు రాజధాని రైతుల పేరుతో సీఎం జగన్‌పై చేస్తున్న వ్యాఖ్యలపై.. 35 ఏళ్లుగా వైఎస్‌ కుటుంబంతో తనకున్న అనుబంధంతోనే తాను అంతలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఒక సీఎంను పట్టుకుని ఉన్మాది, హిట్లర్, తుగ్లక్‌ అంటూ నోటికొచ్చినట్టు పరుష పదజాలంతో దూషిస్తుండటంతో ఆ బాధ చంద్రబాబుకు తెలియాలనే తాను కాస్త ఘాటైన పదాలు వాడాల్సి వచ్చిందన్నారు.

తాను అలా మాట్లాడటం కాస్త బాధ అనిపించినా వైఎస్‌ కుటుంబంపై ఈగ వాలినా సహించలేనన్నారు. ఎదుటి వ్యక్తుల గౌరవాన్ని కించపరుస్తూ సోషల్‌ మీడియాలోను, ఎల్లో మీడియాలోను దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో విమర్శల బాధ ఎలా ఉంటుందో టీడీపీ నేతలకు తెలియజెప్పాలనుకున్నానన్నారు. ఇకనైనా చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో కూడా తన ప్రతిస్పందన అలాగే ఉంటుందని స్పష్టం చేశారు.  

పవన్‌ కుమ్మక్కు రాజకీయాలు మానుకోవాలి 
70 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లకు మారుపేరుగా నిలిచిన చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కుమ్మక్కు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాకినాడలో చోటుచేసుకున్న ఘటనకు దారితీసిన పరిస్థితులపై పవన్‌ కల్యాణ్‌ వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. జనసేన శ్రేణులు ధర్నా ఎక్కడ చేశాయి? వివాదం ఎక్కడ జరిగిందో గుర్తించాలన్నారు. పథకం ప్రకారం తన ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించాలని జనసేన శ్రేణులు చేసిన ప్రయత్నాన్ని తమ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తిప్పికొట్టారే తప్ప, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగలేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top