కేజ్రీవాల్, బీజేపీ నేతల హోరాహోరీ!

Delhi Election Campaign: Kejriwal versus BJP Leaders   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేజ్రీవాల్‌ నాయకత్వంలోని పాలకపక్షం ఆప్, నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర పాలక పక్షం బీజేపీ పార్టీల మధ్య ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యా, వైద్యరంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ప్రధానంగా కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగా, సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో షహీన్‌ బాగ్‌లో కొనసాగుతున్న ప్రజా ఆందోళన ప్రధాన ఆయుధంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. నరేంద్ర మోదీ కావాలా లేదా షహీన్‌ బాగ్‌ కావాలా తేల్చుకోండంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. సీఏఏ, ఎన్‌ఆరీసీలకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో డిసెంబర్‌ 15వ తేదీ నుంచి మహిళల ఆధ్వర్యంలో ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. (కేజ్రీవాల్పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు)

షహీన్‌బాగ్‌లో ఆందోళన చేస్తున్న దేశ ద్రోహులను కాల్చి పారేయండంటూ కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పార్టీ కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించగా, ‘ఆందోళనకారులను ఉపేక్షించినట్లయితే వారు రేపు మీ ఇళ్లలోకి జొరబడి మీ చెల్లెళ్లను, కూతుళ్లను రేప్‌ చేస్తారు, హత్య చేస్తారు’  అని బీజేపీ లోక్‌సభ ఎంపీ పర్వేష్‌ వర్మ ఆరోపించడంతో ఆయన ప్రచారంపై ఎన్నికల కమిషన్‌ ఐదు రోజుల పాటు నిషేధం విధించింది. ‘షహీన్‌బాగ్‌ను ప్రేమిస్తున్న వారికి సరైన సమాధానం ఇవ్వండి’ అంటూ శుక్రవారం  బీజేపీ అధికారికంగా ఓ ఎన్నికల పాటను విడుదల చేసింది. ఈ పాటకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లక్ష లైక్స్‌ వచ్చాయి. (అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్..!)

పర్వేష్‌ వర్మ తాజాగా కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ‘ఆటంక్‌వాది, టెర్రరిస్ట్‌’ అని పిలిచారు. ఇక్కడ ఆప్‌కు సరికొత్త ఆయుధాన్ని ఆయన అందించినట్లయింది. ‘కేజ్రీవాల్‌ ఆటంక వాదా?, కాదనుకుంటే మీరు ఆప్‌కు ఓటేయండి’ అంటూ ఆ పార్టీ సరికొత్త ఎన్నికల పోస్టర్‌ను తీసుకొచ్చింది. ఆప్‌ సానుభూతిపరులైన బీజేపీ ఓటర్లను ఆకర్షించడం కోసమే ఆ పార్టీ ఈ పోస్టర్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. (గల్లీల్లో ఢిల్లీ ప్రచారం)

కేజ్రివాల్‌ పార్టీయే మళ్లీ గెలుస్తుందంటూ పలు ముందస్తు ఎన్నికల సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలనే కసితో ఉన్న బీజేపీ షహీన్‌బాగ్‌ ఆందోళన ఒక్కదాన్నే ఆయుధంగా చేసుకుని ప్రచారం చేస్తోంది. ఆ విషయంలో కేజ్రివాల్‌ను రెచ్చగొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు కేజ్రివాల్‌ సమన్వయంతో శాంతియుతంగా తాను చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలనే నమ్ముకుని ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. (మోదీ 24 క్యారెట్ల బంగారం.. ఆయన్ని నమ్మండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top