గల్లీల్లో ఢిల్లీ ప్రచారం | Sakshi
Sakshi News home page

గల్లీల్లో ఢిల్లీ ప్రచారం

Published Mon, Feb 3 2020 4:15 AM

BJP And Aap Campaning in Delhi Assembly Elections - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. బీజేపీ, ఆప్‌ ప్రచార పర్వంలో దూసుకు పోతూ ఉంటే, కాంగ్రెస్‌ పూర్తిగా వెనుకబడి పోయింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌  మీ ఇంటి పెద్ద కొడుకునంటూ కుటుంబ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్ని వివరించడానికి మీ ఇంటికొస్తానంటూ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కేంద్ర హోం  మంత్రి అమిత్‌ షా బీజేపీ ప్రచారానికి అన్నీ తానై తన భుజస్కంధాలపై మోస్తున్నారు. వీరిద్దరూ ఓటర్లతో వ్యక్తిగతంగా కనెక్ట్‌ అవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు, కొత్త ముఖాలు పార్టీ ప్రచారానికి ఊపు అందించ లేకపోతున్నాయి.    

బీజేపీ ప్రచారానికి ఫేస్‌ షా
ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచార బా«ధ్యతనుమోస్తే, అమిత్‌ షా తెరవెనుక వ్యూహాలు రచిస్తూ ఆయనకు కుడి భుజంగానే పనిచేసేవారు. కానీ, ఈసారి అమిత్‌ షా ఢిల్లీ ఎన్నికల బాధ్యతను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ప్రచారానికి ఫేస్‌గా మారారు. పెద్ద పెద్ద సభలకు బదులుగా చిన్న చిన్న ర్యాలీలు నిర్వహిస్తూ ఢిల్లీని చుట్టేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఓటర్లతో వ్యక్తిగత బాంధవ్యం ఏర్పడేలా ముందుకు వెళుతున్నారు. చిన్న గల్లీల్లో జరిగే సభల్లో పాల్గొంటూ, ట్వీట్లు చేస్తూ, బీజేపీ సైబర్‌ వారియర్లతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతీరోజూ రెండు, మూడు సభలు, ఒక రోడ్‌ షోలో షా పాల్గొంటున్నారు. 5 వేల నుంచి 50 వేల మంది వరకు వచ్చే సభల్లో మాత్రమే పాల్గొని జాతీయ భావమే ప్రధాన ఎజెండాగా చేసుకున్నారు. సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలే ప్రధాన అస్త్రంగా చేసుకొని  బీజేపీ కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.

కేజ్రీవాల్‌ ఫ్యామిలీ సెంటిమెంట్‌
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాముడు మంచి బాలుడు టైప్‌. ఐఐటీ ఖరగ్‌ పూర్‌ విద్యార్థిగా ఉన్నప్పుడు, ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో కూడా ప్రజలతో మంచి సీఎం అనిపించుకోవాలన్న తపనతోనే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద అంశాలపై పెదవి విప్పకుండా ఓటర్లతో నేరుగా అనుసంధానమయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఢిల్లీ కుటుంబాలకు పెద్ద కొడుకునంటూ ఫ్యామిలీ సెంటిమెంట్‌ని రగిలిస్తున్నారు. ‘నేనే మీ ఇంటి పెద్ద కొడుకుని.

రోడ్‌షోలో పాల్గొన్న కేజ్రీవాల్‌

అందుకే మీ వాటర్‌ బిల్లు, కరెంట్‌ బిల్లు, అనారోగ్యం వస్తే ఆస్పత్రికి తీసుకువెళ్లడం, వృద్ధులైతే తీర్థయాత్రలకి వెళ్లడం వంటివన్నీ నేనే చూసుకుంటున్నాను’ అంటూ తమ ఉచిత పథకాలకు మైలేజ్‌ వచ్చేలా ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకోవడానికి ‘ఆప్‌కా కేజ్రీవాల్‌ ఆప్‌ కే ద్వార్‌’ అన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఇందుకోసం ఠ్ఛీ ఛిౌఝ్ఛజ్ఛ్జుటజీఠ్చీ .జీn అన్న వెబ్‌సైట్‌ ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌లోకి వెళితే కేజ్రీవాల్‌ ఇంటి డోర్‌ బెల్‌ మోగిస్తున్న వీడియో ప్రత్యక్షమవుతుంది. లేదంటే 7690944444కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చినా కేజ్రీవాల్‌ వాళ్ల ఇంటికి వెళ్లి అయిదేళ్లలో ఆప్‌ సర్కార్‌ ఏం చేస్తుందో స్వయంగా వివరిస్తారు.

కాంగ్రెస్‌లో స్తబ్దత
ఢిల్లీ ఎన్నికలకు మరో వారం రోజులు కూడా గడువు లేదు. కాంగ్రెస్‌లో ఇంకా స్తబ్దత వీడలేదు. ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుభాష్‌ చోప్రా, ప్రచార కమిటీ చైర్మన్‌ కీర్తి ఆజాద్‌ మధ్య విభేదాలు పార్టీ ప్రచారంపై ప్రభావం చూపిస్తున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఎక్కువ మంది కొత్తవారే కావడంతో ప్రచారానికి ఇప్పటివరకు ఒక ఊపు రాలేదు. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక 4,5 తేదీల్లో రోడ్‌ షోలు నిర్వహించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో నెలకొన్న ఒకరకమైన నిర్వే దం ఆప్‌కి లాభించనుందనే వాదనలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకునే ఆప్‌ పూర్తిగా కొల్లగొట్టేసింది. తన ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఈ మూడు స్తంభాలాటలో ఆప్‌ది పై చేయిగా నిలిచే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement