హామీలు.. రైతు సమస్యలే ఎజెండా | Congress on trs government | Sakshi
Sakshi News home page

హామీలు.. రైతు సమస్యలే ఎజెండా

Oct 27 2017 1:17 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress on trs government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను నిలదీయడానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వం రైతులకిచ్చిన హామీల అమలులో వైఫల్యం, రైతుల సమస్యలు, వివిధ పథకాల్లో అవినీతి, అక్రమాలను ఎజెండాగా చేసుకోవాలని సీఎల్పీ నిర్ణయించింది. కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

రైతుల రుణమాఫీ అమల్లో వైఫల్యం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలో అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయించారు. అలాగే శాంతిభద్రతలు, అట్రాసిటీ కేసులు, నయీం కేసు, మియాపూర్‌ భూముల కుంభకోణం, డ్రగ్స్‌ మాఫియాపై ప్రభుత్వ అసమర్థతను, ఆశ్రిత పక్షపాతాన్ని ఎండగట్టాలని నేతలు నిర్ణయించారు. వీటితోపాటే నిరుద్యోగాన్ని రూపుమాపడానికి, విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటును అమలుచేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న అంశాన్ని తేల్చాలని సీఎల్పీ భావిస్తోంది.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌ రూం అంశాలపై నిలదీయనుంది. గొర్రెలు, చేప పిల్లల పంపిణీలో లోపాలు, స్వయం సహాయక సంఘా లు, ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించకపోవడంపైనా సభలో పోరాడాలని కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది.


శాంతియుతంగా ‘చలో అసెంబ్లీ’ : జానారెడ్డి
రైతుల సమస్యల పరిష్కారంకోసం నిర్వహిస్తున్న చలో అసెంబ్లీని శాంతియుతంగా నిర్వహించే బాధ్యత తమదేనని సీఎల్పీ నేత కె.జానారెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, జి.చిన్నారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డితో కలసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు.

రాష్ట్రంలో రైతాంగానికి రుణమాఫీని ఒకేసారి చేయకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారని పేర్కొన్నారు. వివిధ సమస్యలతో రైతులు ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రైతు సమస్యల తీవ్రతను ప్రభుత్వానికి చెప్పా లనే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రైతులకు నిరసన చెప్పేహక్కు లేకుండా గృహనిర్బంధాలకు దిగడం, అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement