లోక్‌సభపై సీనియర్ల ‘కన్ను’

Congress Seniors focus on Lok sabha - Sakshi

నల్లగొండ నుంచి సై అంటున్న కోమటిరెడ్డి

ఖమ్మం బరిలో రేణుక... భువనగిరి నుంచి గూడూరు లేదా పొన్నాల

మహబూబ్‌నగర్‌ నుంచి రేవంత్‌ పోటీ చేస్తారని ప్రచారం

‘అసెంబ్లీ’ఫలితాలతో డీలాపడ్డ కాంగ్రెస్‌లో ఎంపీ స్థానాలకు తగ్గని పోటీ

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌ సీని యర్లు లోక్‌సభ బరిలో తమ సత్తా చూపాలనే యోచనలో ఉన్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందనే వార్తల నేపథ్యంలో తాము పోటీ చేయాలనుకుంటున్న లోక్‌సభ స్థానంలోని పరిస్థితులపై ఓ అంచనాకు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితో పాటు రేణుకా చౌదరి, గూడూరు నారాయణరెడ్డి, అజారుద్దీన్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్లు ఎంపీ అభ్యర్థుల జాబితాలో వినిపిస్తున్నాయి. వీరంతా ఇప్పటికే తమ తమ స్థానాల్లోని ఫలితాల తీరు, గెలుపొందిన ఎమ్మెల్యేల శక్తియుక్తులు వంటి అంశాలపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 

నేనే పోటీ చేస్తా...
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా... లోక్‌సభ విషయానికి వచ్చేసరికి సమీకరణలు మారుతాయని, ఈసారి లోక్‌సభకు వేరుగా ఎన్నికలు జరుగుతున్నందున రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలు కొంత తక్కువగానే ప్రభావం చూపుతాయనే అంచనాలో కాంగ్రెస్‌ సీనియర్లున్నారు. దీనికి తోడు జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు ఉండే సానుకూలత, మోదీ పట్ల వ్యతిరేకత ఉన్న ఓటర్లు తమ వైపు మొగ్గుచూపుతారనే ఆశావహ దృక్పథంతో లోక్‌సభ బరిలో దిగేందుకు వీరంతా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ అసెంబ్లీ నుంచి ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి తాను నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

గత ఆదివారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడిన ఆయన తాను ఎంపీగా పోటీచేసే అంశం రాహుల్‌ దృష్టిలో ఉందని, ముందస్తుగా అసెంబ్లీకి ఎన్నికలు వచ్చినందునే పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ఈసారి నల్లగొండ జిల్లాలోని ఉత్తమ్, జానా, దామోదర్‌రెడ్డి సహకారంతో నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. ఈసారి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా నల్లగొండ ఎంపీ స్థానం నుంచి బరిలో ఉండే అవకాశాలున్నాయనే చర్చ నేపథ్యంలో కూడా కోమటిరెడ్డి పోటీవైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇక, భువనగిరి ఎంపీ స్థానాన్ని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. తనకు ఈసారి అధిష్టానం అవకాశం ఇస్తుందనే అంచనాలో ఆయన ఉన్నారు. అక్కడి నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా వినిపిస్తోంది. 

పాలమూరుకు పోటాపోటీ..
మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి రేవంత్‌రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి స్థానంలో రేవంత్‌కు అవకాశం ఇస్తారని, అవసరమైతే జైపాల్‌ను మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయిస్తారని అంటున్నారు. ఇక్కడి నుంచి డి.కె.అరుణ లేదంటే ఆమె కుమార్తె స్నిగ్ధారెడ్డి కూడా సీటు అడిగే అవకాశముంది. ఖమ్మం పార్లమెంట్‌ స్థానం నుంచి రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. నిజామాబాద్‌ నుంచి మధుయాష్కీగౌడ్, మెదక్‌ నుంచి సినీనటి విజయశాంతి, చేవెళ్ల నుంచి ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, పెద్దపల్లి నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, జహీరాబాద్‌ నుంచి సురేశ్‌ షెట్కార్‌ బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్కాజ్‌గిరి నుంచి జైపాల్‌రెడ్డి పోటీచేయని పక్షంలో రేణుకాచౌదరి పేరు కూడా పరిశీలించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

అధికారులు కూడా...!
కాంగ్రెస్‌ నేతలతో పాటు పోలీసు, రవాణా శాఖల్లోని అధికారుల పేర్లు కూడా లోక్‌సభ ప్రాబబుల్స్‌ జాబితాలో వినిపిస్తున్నాయి. వరంగల్‌ లోక్‌సభ సీటును ఇద్దరు పోలీసు అధికారులు ఆశిస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్, గత ఎన్నికల్లో పోటీచేసిన నరేశ్‌ జాదవ్, సోయం బాపూరావుతోపాటు రవాణా శాఖలో రాష్ట్రస్థాయి అధికారి పేరు వినిపిస్తోంది. కరీంనగర్‌ పార్లమెంట్‌కు మాజీ మంత్రి జీవన్‌రెడ్డికే అవకాశముంటుందనే చర్చ సాగుతోంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌ అడుగుతున్నా, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ పోటీలో ఉన్నారు. తాను సికింద్రాబాద్‌ ఎంపీగా పోటీచేస్తానని ఆయన గతంలో ప్రకటించారు. అదే జరిగితే హైదరాబాద్‌ బరిలో ప్రముఖ ఎడిటర్‌ జాహెద్‌అలీఖాన్‌ను బరి లో నిలిపే అవకాశాలున్నాయి. నాగర్‌కర్నూలుకు నంది ఎల్లయ్య పోటీచేస్తారా? లేదా? అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ఆయన పోటీ చేయకుంటే మల్లు రవిని బరిలో దింపే అవకాశాలున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top