‘హస్త’వాసి మారేనా? 

Congress Party Review on Telangana election 2018 - Sakshi

ఎన్నికల్లో ఓటమితో భవిష్యత్తుపై గంపెడాశలు 

పంచాయతీ, మున్సిపల్, సహకార ఎన్నికల్లో సత్తా చాటేలా ఇప్పటి నుంచే ప్రణాళిక 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకున్నా భవిష్యత్తు మీద గంపెడాశలు పెట్టుకుంది. ముఖ్యంగా త్వరలోనే జరగనున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్, సహకార, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీని పరుగులు పెట్టించాలని యోచిస్తోంది. ఈ అన్ని ఎన్నికల్లో ఎంతోకొంత మెరుగైన ఫలితాలు సాధిస్తేనే లోక్‌సభ పోరులో టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వగలమన్న భావనతో ఉన్న పార్టీ అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో పడింది. 

టీడీపీతోనా.. ఒంటరిగానా.. 
అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కోలుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ మునిగింది. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా ఓటమే ఎదురైన నేపథ్యంలో పొత్తులపై పునరాలోచన చేయాలని భావిస్తోంది. ఇప్పటికే టీడీపీతో పొత్తు పార్టీకి చేటు కల్గించిందని పార్టీ అంతర్గత సమావేశాల్లో నేతలు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారంలోకి అడుగుపెట్టగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మళ్లీ సెంటిమెంట్‌ను రాజేశారని, పరాయి రాష్ట్రనేతల పాలన అవసరమా? అంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టడంతో ఆ ప్రభావం పార్టీపై పడిందని ఇటీవల జరిగిన పార్టీ పోస్టుమార్టమ్‌ సమావేశాల్లో నేతలు స్పష్టం చేశారు.

ఇక, పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగానే ముందుకెళ్తామని ఇటీవల టీజేఎస్‌ సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము సైతం ఒంటరిగా వెళ్లాలన్న భావన ఎక్కువమంది కాంగ్రెస్‌ నేతల్లో ఉన్నా, హైకమాండ్‌ సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని కాంగ్రెస్‌పెద్దలు వ్యాఖ్యానిస్తున్నా రు. పంచాయతీ ఎన్నికలపై భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించుకునేందుకుగానూ త్వరలోనే కీలకనేతలతో పీసీసీ పెద్దలు సమావేశం కానున్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top