అలా చేయడం.. పెళ్లి లేకుండా సహజీవనమే

Congress MP Revanth Reddy Sensational Comments - Sakshi

బడ్జెట్‌ సమావేశాలు తక్కువగా జరగడం నిబంధనలకు విరుద్ధం

పవన్‌తో సెల్ఫీ దిగేందుకు చాన్స్‌ ఇవ్వలేదని సంపత్‌కు కోపం

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు 14 రోజుల కంటే తక్కువ జరిగితే.. ఆ బడ్జెట్ చెల్లబోదని, ఈ మేరకు అసెంబ్లీ రూల్స్ బుక్‌లోనే నిబంధన ఉందని కాంగ్రెస్‌ నాయకుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో రెండు పార్టీలు ఒప్పుకున్నా సరిపోదు .. ఇలా తక్కువ రోజులు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాలు పదిరోజుల్లో ముగుస్తుండటమంటే.. పెళ్లి లేకుండా సహజీవనం చేసినట్లేనని పేర్కొన్నారు. ఈ విషయమై ఎవరైనా కోర్టులో పిటిషన్ వేస్తే.. కోర్ట్ బడ్జెట్‌ను కొట్టేయడం ఖాయమని చెప్పుకొచ్చారు. బుధవారం అసెంబ్లీ లాబీలో రేవంత్ రెడ్డి  విలేకరులతో మాట్లాడారు. 

కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రులు చెబుతున్నారని, మరి ఆ అవినీతిపై విచారణ జరపకుంటే.. వారికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లే కదా అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై తన వద్ద ఉన్న ఆధారాలను త్వరలోనే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు అందజేస్తానని  రేవంత్‌రెడ్డి చెప్పారు.

బర్నింగ్ టాపిక్‌పై చర్చ జరుగుతుంటే అసెంబ్లీలో ఉండరా?
విద్యుత్ అంశంపై సభలో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేకపోవడం సరికాదని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ అయిన విద్యుత్ అంశాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోలేదో అడిగేందుకు అసెంబ్లీకి వచ్చానని తెలిపారు. విద్యుత్‌పై ప్రభుత్వం ఏకాపాత్రాభినయం చేస్తుంటే.. కాంగ్రెస్ సభ్యులు సభలో లేకపోవడం సరికాదని, దీనిద్వారా పార్టీ ఏం సందేశం ఇచ్చినట్లు అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్‌ను కలిసేందుకు తమ పార్టీ సభ్యులు వెళ్లినప్పుడు.. తనకు కూడా సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఎప్పుడు పదవి వస్తుందో.. ఎప్పుడు పదవి పోతుందో ఎవరికి తెలుసునని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

హుజూర్‌నగర్‌ టికెట్‌ ఇంకా ఎవరికీ ఇవ్వలేదు
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక టికెట్ ఇంకా అధిష్టానం ఎవరికి కేటాయించలేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తన సతీమణి పద్మావతికి హుజూర్‌ నగర్‌ టికెట్‌ ఖరారైనట్టు చెప్తున్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఈ ఉపఎన్నికల్లో పోటీకి  శ్యామల కిరణ్‌రెడ్డి పేరును తాను ప్రతిపాదిస్తున్నానని, అతను లోకల్ నాయకుడని తెలిపారు. 

పవన్‌తో సెల్ఫీ దిగనివ్వలేదనే కోపం..!
నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు, ఆయన నియమించిన యురేనియం వ్యతిరేక కమిటీ చైర్మన్ వీహెచ్ చెప్పారని, ఈ నేపథ్యంలో తాను వాళ్ళ వెంట వెళ్ళడంలో తప్పేముందని ప్రశ్నించారు. యురేనియంపై సంపత్ కుమార్‌కు ఏబీసీడీలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. పవన్‌తో మీటింగ్‌కు తాను ఎందుకు వెళ్లానని అడిగేవాళ్ళు .. వాళ్లే ఎందుకొచ్చినట్టు సమాధానం చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ సంపత్ కుమార్‌తో సెల్ఫీ దిగేందుకు అవకాశం ఇవ్వలేదని, ఆ కోపాన్ని తనపై చూపిస్తే ఏం లాభమని ప్రశ్నించారు. ఏఐసీసీ కార్యదర్శులుగా ఉండి .. మహారాష్ట్రలో ఎన్నికలు వదిలిపెట్టి .. సంపత్, వంశీచంద్‌రెడ్డిలకు ఈ మీటింగ్‌లో ఏం పని అని ప్రశ్నించారు. యురేనియం అంశంపై తాను స్థానికంగా  టీడీపీలో ఉండగానే పోరాటం ప్రారంభించానని చెప్పారు. ఇప్పుడు ఆ పోరాటంలో కలిసి వచ్చేవాళ్ళు వస్తారు, రానివాళ్ళు రారని పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top