‘రద్దు’పై మళ్లీ రగడ

Congress movement on komati reddy and sampath kumar's membership cancellation - Sakshi

కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాల రద్దుపై కాంగ్రెస్‌ మలి ఉద్యమం

నేడు స్పీకర్‌కు వినతిపత్రం ఇవ్వనున్న పార్టీ ప్రతినిధి బృందం

అయినా ప్రభుత్వం స్పందించకపోతే సుప్రీంకు వెళ్లాలని నిర్ణయం

రాష్ట్రపతినీ కలిసేందుకు సన్నాహాలు.. బస్సు యాత్రలోనూ ఫోకస్‌

సాక్షి, హైదరాబాద్‌: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాల రద్దుపై మలిదశ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోరుతూ ఆ పార్టీ ప్రతినిధి బృందం సోమవారం అసెంబ్లీ స్పీకర్‌ను కలవనుంది.

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ప్రతినిధుల బృందం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ను కలసి వినతిపత్రం ఇవ్వనుంది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు రాష్ట్రపతిని కలవాలని, ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, త్వరలో నిర్వహించనున్న బస్సుయాత్రలోనూ ఈ అంశాన్ని ఫోకస్‌ చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా..
సభ్యత్వాల రద్దుపై తొలిదశలో 48 గంటల దీక్షలతో పాటు గవర్నర్‌ను కలసి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ నేతలు కోరారు. హైకోర్టునూ ఆశ్రయించారు. సభ్యత్వాల రద్దుకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ ఆత్మరక్షణలో పడింది.

రెండు సార్లు తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఆ ఎమ్మెల్యేల విషయంలో పార్టీ పరంగా సరిగా స్పందించలేదని అంతర్గత చర్చల్లో అభిప్రాయపడిన నేపథ్యంలో మరో పోరాటానికి కాంగ్రెస్‌ నేతలు శ్రీకారం చుట్టారు.

ఈ వారంలోనే ‘సుప్రీం’లో పిటిషన్‌..
సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం నుంచి కార్యాచరణను నేతలు అమలు చేయనున్నారు. స్పీకర్‌ను కలవడంతో పాటు ఏఐసీసీ పెద్దల ద్వారా రాష్ట్రపతిని కలసి విన్నవించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోసం ఇప్పటికే కబురు పంపారు.

త్వరలోనే అపాయింట్‌మెంట్‌ లభిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతిని కలవడంతో పాటు కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించనున్నారు. ఈ మేరకు పార్టీ తరఫు న్యాయవాదులు కసరత్తు ప్రారంభించారు. ఈ వారంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

మూకుమ్మడి రాజీనామాలు..?
న్యాయ, రాజ్యాంగపర ప్రయత్నాలతో పాటు ఈ అంశాన్ని ప్రజల్లోకి కూడా తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ప్రత్యేకంగా సభలు నిర్వహించడం, బస్సుయాత్రలో నిర్వహించే సభల్లోనూ నొక్కి వక్కాణించడం ద్వారా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని యోచిస్తున్నారు.

ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని.. ఖమ్మం, అలంపూర్‌లలో బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పార్టీలో చర్చ జరుగుతున్న విధంగా మూకుమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సిద్ధమవుతారా.. వేచిచూడాల్సిందే!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top