పట్టణాల్లో అనుకూలం.. పల్లెల్లో ప్రతికూలం

Congress Hopes To Get 3 Lok Sabha Seats In Telangana - Sakshi

లోక్‌సభ పోలింగ్‌ సరళిపై కాంగ్రెస్‌ నేతల అంచనాలు

6 చోట్ల గట్టి పోటీ.. 3 లేదా 4 స్థానాల్లో గెలుపుపై ధీమా

8చోట్ల వెనుకబడ్డామనే భావన.. మిశ్రమ ఫలితాలపై చర్చ

మోదీకి వ్యతిరేకంగా ముస్లింలు తమకే ఓటేస్తారని ఆశలు

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ పోరులో మిశ్రమ ఫలితాలు వస్తాయని ప్రతిపక్ష కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. పోలింగ్‌ సరళిని బట్టి 6 లోక్‌సభ నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చామని, 3 లేదా 4 స్థానాల్లో గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలంటున్నారు. 8 స్థానాల్లో మాత్రం పూర్తిగా వెనుకబడిపోయామని భావిస్తున్నారు. పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం చేవెళ్ల, ఖమ్మం, ఆదిలాబాద్, భువనగిరి, నల్లగొండ, మల్కాజ్‌గిరి స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గట్టిగానే ఎదుర్కొన్నామనే ధీమా వ్యక్తమవుతోంది. పెద్దపల్లి, జహీరాబాద్, మహబూబాబాద్‌ స్థానాల్లోనూ పెద్ద సంఖ్యలో ఓట్లు వస్తాయని, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ స్థానాల్లో పూర్తిగా వెనుకబడిపోయామనే భావన పోలింగ్‌ ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తోంది.  

ఆ నాలుగు... ఆదుకుంటాయా? 
అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై కాంగ్రెస్‌ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా పార్టీ నేతలు, కేడర్‌లో పలు రకాల విశ్లేషణలు జరుగుతున్నా మొత్తం మీద తమను నాలుగు అంశాలు ఆదుకుంటాయనే ధీమా కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలనే ఆకాంక్ష, జాతీయస్థాయి ఎన్నికల్లో రాహుల్‌ కార్డుతో పాటు మోదీపై ఉన్న వ్యతిరేకత, పోటీలో ఉన్న అభ్యర్థుల చరిష్మా, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం పెద్దగా ఉండదనే అంచనాలో కాంగ్రెస్‌ నేతలున్నారు. ఈ కోణంలోనే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ తమకు అనుకూలంగా జరిగిందని అంటున్నారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని కేడర్‌లో నెలకొన్న నైరాశ్యం తమ పుట్టి ముంచే అవకాశాలున్నాయని, ప్రచారం సరిగ్గా జరగని లోక్‌సభ స్థానాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన విధంగా పోలింగ్‌ జరగలేదని అంచనా వేస్తున్నారు.

కానీ, నల్లగొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో చరిష్మా ఉన్న నేతలు బరిలో ఉన్నందున తమ ఓటు బ్యాంక్‌తో పాటు సామాజిక సమీకరణలు, స్థానిక అంశాలు లాభం చేకూరుస్తాయని అంటున్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌ స్థానాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయా... ఆదిలాబాద్‌లో లంబాడీ సామాజిక వర్గానికి చెందిన తమ అభ్యర్థికి సామాజిక సమీకరణలు మేలు చేకూరుస్తాయా.. లాంటి విశ్లేషణలు కూడా పార్టీ నేతల్లో జరుగుతున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపిన ముస్లింలు ఈసారి మోదీకి వ్యతిరేకంగా తమకు లాభం చేకూరుస్తారని, ముస్లిం మైనార్టీ ఓటర్లు తమ వైపే మొగ్గు చూపారని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయి అంశాల వైపే ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు కూడా మొగ్గు చూపితే మాత్రం నిశ్శబ్ద ఓటింగ్‌ తమకు సానుకూల ఫలితాలను తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

పల్లెల్లో పట్టు సడలింది.. 
లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ నుంచి జరిగిన వలసల కారణంగా పెద్ద ఎత్తున కుదేలైన కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత కోలుకోలేకపోయిందని ప్రచార సరళిని బట్టి అర్థమవుతోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ స్థాయి నేతలు వరుసగా పార్టీని వీడి వెళ్లిపోవడంతో గ్రామాల్లో కేడర్‌ను కదలించే నాథుడే లేకుండా పోయిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి తోడు లోక్‌సభ ఎన్నికల తరుణంలో నేతలంతా పార్టీని వీడటంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కూడా పెద్దగా ఉత్సాహం కనిపించలేదని కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి) కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), రేవంత్‌రెడ్డి (మల్కాజ్‌గిరి)లు మాత్రమే ప్రచారంలో టీఆర్‌ఎస్‌కు దీటుగా దూసుకెళ్లినట్టు కనిపించగా.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు ప్రచార జోరులో పూర్తిగా వెనుకబడిపోయారు. 

దీంతో అడపాదడపా జరిగిన సభలు, ర్యాలీలతోనే లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిపోయిందని, గ్రామాల్లో బూత్‌స్థాయికి వెళ్లి ఓటర్లను పలకరించి ఓటేయమని అడిగే పరిస్థితి లేకుండా పోయిందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. దీంతో గ్రామాల్లోని సంప్రదాయ ఓటు బ్యాంకుకు అదనంగా పెద్దగా ఓట్లు రాలే అవకాశాల్లేవని, కనీసం ఏజెంట్లను నియమించుకోవడం కూడా కష్టమైందంటేనే క్షేత్రస్థాయి కేడర్‌లోని నిస్తేజం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని టీపీసీసీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్న వారిని అయినా పలకరించి నాలుగు ఓట్లు అడగాలనే ఆలోచన కూడా పార్టీ అభ్యర్థులకు రాలేదని, ప్రచార సరళిని బట్టి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ తమకు ప్రతికూలంగానే ఉంటుందని అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top