పొత్తుతో కొంపకొల్లేరేనా?

Congress Cadre May Suffer With Alliance With TDP - Sakshi

 టీడీపీతో కలిసి పోటీ కాంగ్రెస్‌ను ముంచుతుందా?

రాహుల్‌–చంద్రబాబు భేటీ నేపథ్యంలో

తెలంగాణ కాంగ్రెస్‌పై నీలినీడలు

కేసీఆర్‌ను ఓడించేందుకే టీడీపీతో పొత్తంటూ ఇప్పటివరకు కేడర్‌ను నమ్మించిన టీ కాంగ్రెస్‌

ఎన్నికల వేళ రాహుల్‌–బాబు బంధంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతల్లో ఆందోళన

కాంగ్రెస్‌ వెన్నంటి ఉన్న ఓ సామాజికవర్గం ఓట్లలో భారీగా చీలికకు అవకాశం

బాబు వర్గం ఓట్లపై ఆధారపడి పొత్తుకు సై అంటున్నారని కార్యకర్తల విమర్శ

సెటిలర్లంతా బాబు వైపే ఉన్నారనే భ్రమలో కొందరు నేతలున్నారంటూ ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం పోరాడుతోందా లేక గుర్తింపు కోసం పాకులాడుతోందా? గత 4–5 వారాలుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఇవే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ను గద్దె దించే లక్ష్యంతో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ఇప్పటివరకు కార్యకర్తలు, సానుభూతిపరులకు ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చినప్పటికీ గురువారం ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం వారికి అస్సలు మింగుడుపడటంలేదు. రాహుల్‌ గాంధీతో చంద్రబాబు సమావేశం కావడం, ఇరు పార్టీలు వైరుధ్యాలను మరచి జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తామని ప్రకటించడం కాంగ్రెస్‌ కేడర్‌తోపాటు నాయకుల్లోనూ గుబులు రేపుతోంది.

ప్రత్యేకించి తమ పార్టీకి దశాబ్దాలుగా వెన్నంటి ఉన్న ఓ సామాజికవర్గం ప్రజలు రాహుల్‌–చంద్రబాబు భేటీ నేపథ్యంలో వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోందని, ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నామని కలవరపడుతున్నారు. ‘ఈ పరిణామాలు చూస్తుంటే మళ్లీ ప్రతిపక్షంలోనే ఉంటామా అనే అనుమానం కలుగుతోంది. నా నియోజకవర్గ కార్యకర్తలు గురువారం నాటి పరిణామాలను తీవ్రంగా తీసుకున్నట్లు వారి మాటల్లో వ్యక్తమైంది. ఇప్పుడు నా గెలుపు మీద నాకే అనుమానంగా ఉంది’అని దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఓ సామాజికవర్గ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో ఇరుపక్షాల అభ్యర్థులు ఆ సామాజికవర్గానికి చెందిన వాళ్లే అయితే ఈసారి వారు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే ప్రమాదం ఉంని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘నేను 28 ఏళ్లుగా టీడీపీకి బద్ధ వ్యతిరేకిని. ఆ పార్టీ విధానాలు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడి పోలీసు కేసులు కూడా ఎదుర్కొన్నా. ఇప్పుడు చంద్రబాబుతో చెలిమి ఏమిటి అని అడగానికి గాంధీ భవన్‌కు వచ్చా. కానీ నాకు ఇక్కడ అంత పేరున్న నాయకులెవరూ కనిపించలేదు’అని మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే కాంగ్రెస్‌ సానుభూతిపరుడు పేర్కొన్నారు. ఎన్టీ రామారావును ఓడించడానికి ఉద్యమంలా పనిచేసిన తమకు ఇప్పుడు చంద్రబాబుతో మిలాఖత్‌ అయిన కాంగ్రెస్‌ పార్టీ కూడా అంతేనని రవీందర్‌రెడ్డి అనే మరో సానుభూతిపరుడు వ్యాఖ్యానించారు.

టీ కాంగ్రెస్‌పై నీలినీడలు...
రాహుల్‌–చంద్రబాబు సమావేశం రాష్ట్రంలో కాంగ్రెస్‌ కూటమి విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు అనుమానిస్తున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్‌ కూటమికి గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్న వారు ఇప్పుడు మాట మారుస్తున్నారని, కేసీఆర్‌ అంటే ఇష్టం లేకున్నా ఆయన పార్టీకే ఓటు వేయాల్సి వస్తోందని బహిరంగంగానే చెబుతున్నారని ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ఓ నాయకుడు పేర్కొన్నారు. రాహుల్‌–చంద్రబాబు భేటీ తరువాత ముఖ్య కార్యకర్తలతో మాట్లాడినప్పుడు వారిలో మెజారిటీ పెదవి విరిచారని, ఇక కాంగ్రెస్‌లో ఉండి ప్రయోజనం ఏమిటంటూ నిర్వేదంగా మాట్లాడారని ఆ నాయకుడు అన్నారు. గురువారం ఉదయం దాకా టికెట్‌ వస్తుందో రాదోనన్న ఉత్కంఠతో గడిపానని, ఇప్పుడు వచ్చినా రాకపోయినా ఫరవాలేదన్న భావనలో ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తమ కంటిని తామే పొడుచుకున్నట్లు ఉందని ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్న ఓ మాజీ మంత్రి అన్నారు.

దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న ఆయన పది రోజుల క్రితమే ప్రచారాన్ని ప్రారంభించారు. ‘గురువారం ఉదయానికి, సాయంత్రానికి మా కార్యకర్తల్లో తేడా గమనించా. టీడీపీతో పొత్తు వేరు. చంద్రబాబు–రాహుల్‌ కలయిక వేరు. ఇది కచ్చితంగా పార్టీకి చేటు తెస్తుందన్న ఆందోళన నాకైతే ఉంది’అని ఆ మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. రెడ్డి సామాజిక ప్రాబల్యం ఉన్న చోట కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ రెడ్లనే మోహరించనున్నాయి. టీఆర్‌ఎస్‌ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించగా ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కూడా దాదాపుగా రెడ్డి అభ్యర్థులే బరిలో ఉన్నారు. దీంతో ఆ నియోజకవర్గాల్లోనే రాహుల్‌–బాబు భేటీ తాలూకు పరిణామం కాంగ్రెస్‌ కొంపముంచొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్‌–బాబు సమావేశాన్ని అంత తక్కువగా తీసి పడేయడానికి వీల్లేదని, ఇది కచ్చితంగా కాంగ్రెస్‌కే నష్టమేనని ఆ పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధంఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ నేత అన్నారు.

వైఎస్సార్‌ అభిమానుల్లో ఆగ్రహం...
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డికి తెలంగాణలో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పోటీ చేస్తే బాగుండునని ఆశిస్తున్న అభిమానాలు కూడా ఉన్నారు. ఒకవేళ ఆ పార్టీ పోటీ చేయకపోతే కాంగ్రెస్‌కు మద్దతివ్వాలన్నది వారి ఆలోచన. కానీ గురువారం ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలు వారికి ఏమాత్రం మింగుడు పడలేదు. ‘రాహుల్‌తో చంద్రబాబు భేటీని టీవీలో చూస్తుంటే నా రక్తం మరిగిపోయింది. ఆ క్షణంలోనే కాంగ్రెస్‌పై భ్రమలు వదిలేయాలని నిర్ణయించుకున్నా’అని ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారి పేర్కొన్నారు. ‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన జీవితకాలం కాంగ్రెస్‌ పక్షాన పోరాడారు. ఇదే చంద్రబాబు వైఎస్సార్‌ను ఎన్ని రకాలుగా దూషించారో, ఎంత దుష్ప్రరం చేశారో కాంగ్రెస్‌ నేతలు మరచిపోయారా? ఇప్పుడు ఆయన లేరు కాబట్టి బాబుకు కాంగ్రెస్‌ బంధువైందా?’అని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు వేస్తానన్నారు.

సెటిలర్లు అంటే బాబు సామాజికవర్గమా?
ఏపీలో చంద్రబాబుపట్ల అక్కడి ప్రజల్లోనే తీవ్రమైన వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయని, అలాంటప్పుడు తెలంగాణలోని ఆంధ్రా సెటిలర్లంతా కూటమికి ఎందుకు మద్దతిస్తారని హైదరాబాద్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు ప్రశ్నించారు. ‘మా పార్టీ ఆశపడుతున్నట్లు బాబు సామాజికవర్గానికి చెందిన ఓట్లలో అత్యధికం మాత్రమే మా పార్టీకి వస్తాయి. ఇతరులు ఎందుకు మద్దతిస్తారు? ఈ చిన్న లాజిక్‌ను మా పార్టీ మరచిపోయింది. ప్రజలు అనుకుంటున్నట్లు డబ్బులు, హెలికాప్లర్ల కోసమే బాబుతో పొత్తు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది’అని ఆ నేత వ్యాఖ్యానించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top