‘కృష్ణమ్మ చంద్రబాబును పారిపోయేటట్లు చేసింది’

Chief Whip Srikanth Reddy Fires On Chandrababu Naidu At Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వర్షాలు పడుతుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ హయాంలో వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేశారని, బాబు చేసిదంతా అవినీతేనని మండిపడ్డారు. కరకట్టపై ఉన్న చంద్రబాబును కృష్ణమ్మ పారిపోయేటట్లు చేసిందని ఎద్దేవా చేశారు. అనేక ప్రాజెక్టులను రూపకల్పన చేసిన ఘనత వైఎస్సార్‌ది అని, చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదని  దుయ్యబట్టారు. నదుల అనుంసంధానం అంటూ బాబు కోట్ల రూపాయలు దోచుకున్నారని, పోలవరంలో అవినీతి జరిగిందని ప్రాజెక్టు అథారిటీయే చెప్పిందని స్పష్టం చేశారు.

రౌడీలు, గుండాలంటూ రాయలసీమ ప్రజలను బాబు అవమానిస్తున్నారని, సీమ ప్రజలంటే బాబుకు ఎందుకంత ఈర్ష్య అని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేతలు హత్యలు చేస్తుంటే చంద్రబాబు పంచాయతీలు చేస్తూ కూర్చున్నారని విమర్శించారు. గత ఐదేళ్లో చంద్రబాబు చేసినవన్నీ పంచాయతీలేనని,శాంతిభద్రతల పరిరక్షణ కోసం బాబు చేసిందేమీ లేదని ఆరోపించారు. కరకట్ట వద్ద రాజకీయ లబ్ది కోసమే కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి ప్రజావేదిక నిర్మించారని స్పష్టం చేశారు. అక్కడ నిర్మిస్తే దిగువ ప్రాంతంలో నివాసం ఉండే వారికి ఇబ్బంది అని ఇంజనీర్లు చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదన్నారు.

బ్యారేజీ గేట్లు ఎత్తడం రెండు గంటలు ఆలస్యమైతే బాబు ఇంటి వద్ద పరిస్థితి ఊహించలేమని, చంద్రబాబు వరదల్లో చిక్కుకునేవారని, అధికారులు రాత్రింబవళ్లు అక్కడే పనిచేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఖాళీ చేస్తే తనను అందరూ అసహ్యించుకుంటున్నారని భావించి.. సామాన్లను, కార్లను వేరే చోటికి పంపి ఆయన హైదరాబాద్‌కు పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదని, చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి తన తప్పును ఒప్పుకోవాలని సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top