బాబుకు కుప్పం.. భయం

Chandrababu Naidu Fear Kuppam Constituency For Local Elections - Sakshi

పేరుకు టీడీపీ ప్రజా చైతన్యయాత్ర

స్థానిక సంస్థల ఎన్నికల్లో పరువు కోసం చంద్రబాబు తాపత్రయం

జనం లేక వెలవెలబోతున్న సభలు

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు కుప్పం భయం పట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయనకు ముచ్చెమటలు పట్టించాయి. ఓట్ల లెక్కింపులో రెండు రౌండ్ల     ఫలితాల్లో చంద్రబాబు వెనుకబడ్డారు. ఇదిలా ఉంటే 30 ఏళ్లుగా కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఆ ప్రాంతానికి ఏమీ చేయలేదు. కుప్పం మున్సిపాలిటీ కావాలన్నది ఆ ప్రాంత వాసుల దీర్ఘకాలిక కల. దాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నెరవేర్చింది. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కుప్పంలో కూడా టీడీపీ మనుగడ కష్టమని గ్రహించారు. ప్రజా చైతన్య యాత్ర పేరుతో స్థానిక ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

సాక్షి, చిత్తూరు,తిరుపతి: ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో తిష్ట వేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించేందుకు నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకు ని ఊరూవాడా తిరుగుతున్నారు. కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు సోమవారం బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ సభకు జనాన్ని బస్సుల్లో తరలించి టీడీపీ నాయకులు పరువు కాపాడేందుకు ప్రయత్నించారు. అదే రోజు గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంలో ఎన్టీఆర్‌ నామస్మరణ జపించారు. మంగళవారం కుప్పం నియోజకవర్గంలో ఊరూరా తిరుగుతూ తెలిసిన వారి నివాసాలకు వెళ్లి పలకరించారు.

టీడీపీ నాయకులు ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న మహిళలతో హారతులు ఇప్పించుకుని మెప్పు పొందే ప్రయత్నం చేశారు. కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి రెండు రౌండ్లు చంద్రబాబుకు చెమటలు పట్టించే పరిస్థితి ఎదురైంది. మెజారిటీ పడిపోవడంతో చంద్రబాబు, టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. మూడుసార్లు ముఖ్య మంత్రిగా ఉన్నా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కృష్ణా జలాలు తీసుకువస్తానని ప్రగ్భాలాలు పలికి, రైతుల ఆశలు అడియాశలు చేశారు. ఏనాడూ పాలారు నదిని పట్టించుకోని ఆయన ఓటమి చవిచూశాక దాని జపం చేస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో ప్రభావం చూపుతుండడంతో భయం పట్టుకుంది.

యాత్ర ముసుగులో స్థానిక ప్రచారం
స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటకు బీటలు వారుతాయనే పక్కా సమాచారంతో చంద్రబాబుకు వణుకు మొదలైందని జోరుగా ప్రచారం సాగుతోంది. పరువు నిలుపుకునేందుకే కుప్పంలో కాళ్లరిగేలా తిరుగుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఉపన్యాసాలు దంచడంపై స్థానికులు నోరెళ్లబెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక స్థానికుల దీర్ఘకాలిక కల నెరవేరుస్తూ కుప్పాన్ని మున్సిపాలిటీగా ప్రకటించడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే పట్టం కడతారని చంద్రబాబుకు సమాచారం అందింది. దీంతో ఎలాగైనా మున్సిపాలిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను దక్కించుకోవాలని కుప్పంలో పరుగు పరుగున పర్యటిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top