చంద్రన్న సమర్పించు... హస్తినలో ‘హంగామా’ | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు ముందు ఢిల్లీలో సరికొత్త డ్రామా

Published Tue, Feb 12 2019 2:59 PM

Chandrababu Double Standards On Special Category Status - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ‘నారా’వారి నాటకం కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన నారా బాబు నేడు హస్తిన నడివీధుల్లో వేస్తున్న నాటకాలు చూసి జనం నివ్వెరపోతున్నారు. ‘నవ్వి పోదురు నాకేటి సిగ్గు’ తరహాలో చంద్రబాబు సాగిస్తున్న శీలహీన రాజకీయాల్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాపై హఠాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నరేంద్ర మోదీతో అంటకాగినప్పుడు ప్రత్యేక హోదా అంశం గుర్తుకు రాలేదా అని నిలదీస్తున్నారు. కేంద్ర సర్కారులో టీడీపీ కొనసాగినప్పుడు ఏం చేశారని సూటిగా అడుగుతున్నారు.

నాలుగున్నరేళ్ల పాలనలో ప్రత్యేక హోదా ఊసెత్తని ఏపీ సీఎం ఇప్పుడు తెగ ఆరాటపడిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రత్యేక హోదా జపం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏపీలో నడిపించిన డ్రామాను ఢిల్లీ వీధులకు చేర్చారు. ధర్మాట పోరాట దీక్ష పేరుతో వందిమాగధులను హస్తినకు తరలించి బలప్రదర్శనకు దిగారు. ప్రజలు గమనిస్తున్నారన్న కనీసం విచక్షణ కూడా లేకుండా పచ్చ మీడియా అండతో ప్రత్యేక హోదా అంశాన్ని హైజాక్‌ చేసేందుకు వేయాల్సిన ఎత్తులన్నీ వేసేశారు. రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వడానికి చంద్రబాబు చేసిన స్టంట్‌ జనాలకు నవ్వు తెప్పిస్తోంది. ఎందుకంటే వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ పని ఎప్పుడో చేశారు. అంతేకాదు పలుమార్లు రాష్ట్రపతికి, కేంద్రానికి లేఖలు రాశారు. ఏకంగా తమ పార్టీ చెందిన లోక్‌సభ ఎంపీలతో రాజీనామా చేయించి దేశమంతా ప్రత్యేక హోదా గురించి చర్చింకునేలా చేశారు.

ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి గత నాలుగున్నరేళ్లుగా చేసిన రాజీలేని పోరాటం దేశం యావత్తు పరికించింది. నిరాహారదీక్షలు, యువభేరిలు, ధర్నాలతో హోదా ఉద్యమాన్ని జననేత ఉరకలెత్తించారు. ప్రత్యేక హోదాను ఎన్నికల అంశంగా చేస్తామని ఆనాడే జగన్‌ ప్రకటించారు. సరిగ్గా ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతోంది. ఇప్పటిదాకా ప్రత్యేక ప్యాకేజీ పాట పాడిన చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని హోదా రాగం అందుకున్నారు. జగన్ గతంలో చేసేసిన కార్యక్రమాలను ఇప్పుడు హడావుడిగా మొదలు పెట్టి తన దుర్బద్ధిని చాటుకున్నారు. అంతేకాదు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాపీ రాయుడి అవతారం ఎత్తేశారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను ఆదరాబాదరా అమలు చేసేసి ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’  అన్నట్టు బిల్డప్‌లు ఇస్తున్నారు. టక్కుటమారాలతో ప్రజలను తక్కువ అంచనా వేస్తున్న చంద్రబాబుకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదంటున్నారు విశ్లేషకులు.

Advertisement

తప్పక చదవండి

Advertisement