దేశాన్ని కాదు.. టీడీపీని రక్షించేందుకు..

Botsa Satyanarayana Slams Chandrababu and TDP - Sakshi

కాంగ్రెస్‌ టీడీపీ కలయికపై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స విమర్శ 

సాక్షి, విశాఖపట్నం: దేశాన్ని రక్షించేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలిపినట్టుగా సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. దేశాన్ని రక్షించేందుకు కాదు.. మామను వెన్నుపోటు పొడిచి లాక్కున్న తెలుగుదేశం పార్టీని రక్షించుకునేందుకే కాంగ్రెస్‌తో జతకట్టారన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రమేష్‌పై ఐటీ, సుజనాచౌదరిపై ఈడీ దాడులతో పాటు రేపు తనపై ఎక్కడ సీబీఐ దాడులు జరుగుతాయోననే భయం బాబుకు పట్టుకుందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించడానికి బాబు ఎందుకు భయపడుతున్నారని బొత్స ప్రశ్నించారు.

జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును సిట్టింగ్‌ జడ్జి లేదా కేంద్ర సంస్థ అధీనంలో విచారణ జరపమంటే ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో చెప్పాలన్నారు. ఘటన జరిగిన గంటలోనే డీజీపీ, ఆ వెంటనే సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే చినబాబు కనుసన్నల్లో పోలీసుల అండదండలతో  జరిగిందని అర్ధమవుతుందన్నారు. పైగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే ఓ డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తారా? ఇలా ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. విశాఖ భూ కుంభకోణంపై వేసిన సిట్‌ దర్యాప్తు నేటికీ వెలుగులోకి రాలేదన్నారు. జగన్‌ కేసులో వేసిన సిట్‌ విచారణ తీరు కూడా అలాగే ఉంటుందన్నారు.  

6 రోజుల కస్టడీలో నిందితుడ్ని ఏమాత్రం రాబట్టలేక పోయామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ పెద్దలు తయారు చేసిన స్క్రిప్ట్‌కనుగుణంగానే వైఎస్‌ దేవుడని, తాను జగన్‌ అభిమానని చెప్పించేందుకే కేజీహెచ్‌ నాటకమాడారని, పొరపాటున అతని నోటివెంట తనకు ప్రాణ హాని ఉందని, తనను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ అనడంతోనే అతను బతికిబట్టకట్టాడని.. లేకుంటే ఈపాటికి చంపేసే వారన్నారు. నిందితుడి కాల్‌ డేటా బయటపెడితే వెనుక ఉన్న దోషులెవరో తెలిసిపోతుందన్నారు. నిందితుడు టీడీపీ కార్యకర్తని ఆరోపించిన తమ పార్టీ నేత జోగి రమేష్‌పై కేసులు పెడతారు, నోటీసులు ఇస్తారు, అదే ఆపరేషన్‌ గరుడ అన్న శివాజీపై ఎలాంటి విచారణలుండవన్నారు. కుట్రకోణం వెలుగు చూడాలన్నా వెనుకనున్న సూత్రధారులు బయటకు రావాలన్నా థర్డ్‌ పార్టీ ద్వారా విచారణ చేయాల్సిందేనని చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top