అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం: బొత్స

Botsa Satyanarayana Lashs Out At Chandrababu Naidu Remarks - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అమ్మ ఒడి’  పథకంపై మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసలు కురిపించారు. అమ్మ ఒడి ఒక చరిత్ర అని, ఈ పథకం ద్వారా 42 లక్షల 12 వేల మంది తల్లులకు దాదాపుగా రూ.6318 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం ప్రారంభించని అమ్మ ఒడి పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారని, గతంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని, అమ్మ ఒడి పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని చెప్పారు. 

అయితే ఈ పథకంపై కొన్ని మీడియా చానల్స్‌, కొన్ని పత్రికలు ఇష్టానుసారంగా విమర్శలు, దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఒక్కరే విపక్ష నేత కాదని, ఏ పార్టీ మీద తమకు కోపం లేదని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. విపక్షాలు తమ స్వార్థం కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని, ప్రభుత్వ పథకాలు అమలు ప్రతిపక్షానికి నచ్చడం లేదని అన్నారు.

ఎవరి కోసం ఈ రాతలు?
ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల అనంతరం మరోలా రాజధానిపై ఈనాడు దినపత్రిక రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఎందుకు, ఎవరి కోసం ఈ రాతలు అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు, ఈనాడు కుట్ర పన్నుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారని బొత్స విమర్శించారు. ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధిలో 20ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు సమాజం కోసం కాకుండా తమ సామాజిక వర్గం కోసం పని చేస్తున్నాయని విమర్శించారు. సమాజ స్ఫూర్తి కంటే సామాజిక స్ఫూర్తి ఎక్కువగా ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలియవా అంటూ బొత్స ప్రశ్నించారు. 

చంద్రబాబును ఏనాడైనా ప్రశ్నించారా?
మంత్రి బొత్స మాట్లాడుతూ...‘మీకు నచ్చిన సీఎం అయితే ఒక రకంగా రాస్తారా? వయస్సు పెరిగినా ఆలోచన మాత్రం మారలేదు. ఇప్పటికైనా మీ విలువలు పెంచుకోండి. ఎందుకు, ఎవరి కోసం ఇలాంటి రాతలు రాస్తున్నారు. ఈనాడు పత్రిక ఏమైనా మాకు బాసా? మీరు చెప్పినట్లు మేం ఆలోచన చేయాలా? రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? లక్షా 9వేల కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారని ఏనాడైనా చంద్రబాబును ప్రశ్నించారా? రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మాకు తెలుసు. మాది బాధ్యతగల ప్రభుత్వం. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజలు క్షమించరు. చంద్రబాబు మాయ మాటలు ఎవరు నమ్ముతారు? అనుభవం ఉందని అధికారం ఇస్తే అయిదేళ్లు బాబు మోసం చేశారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే తాత్కాలిక భవనాలే కట్టారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ప్రజా ప్రతినిధులను నారా లోకేష్‌ విమర్శించడం తగదు. ముందు ఆయన భాష నేర్చుకోవాలి. 

రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు..
మా ప్రభుత్వానికి అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం  ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామో చూడండి. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ విషయంలో రాజీపడం. కరువు పరిస్థితుల నుంచి రాయలసీమ బయటపడాలి. సీమలో చెరువులు నిండాలి మా విధానాల ప్రకారమే ముందుకు వెళతాం. అన్ని ప్రాంతాల అభివృద్ధికి మేము కట్టబడి ఉన్నాం. ప్రతి ప్రాంతాన్ని సమదృష్టితో చూడాలని శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పిందో మీకు తెలియదా? రామోజీరావు, చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు. విశాఖ నుంచి విజయవాడకు ఎంత దూరమో ...విజయవాడ నుంచి విశాఖపట్నం కూడా అంతే దూరం ఉంటుంది. ఉత్తరాంధ్రా, రాయలసీమ ప్రాంతాలు ఏమైపోయినా ఫర్వాలేదా? రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి చంద్రబాబు ఏమి చేశారు. రాజధాని నిర్మాణానికి లక్ష 9 వేల 23 కోట్లు ఖర్చు అవుతుందని ఇదే వార్త 2018లో ఈనాడులో వార్త రాశారు. మరి ఇప్పుడు అమరావతికి పైసా ఖర్చు అవసరం లేదని రాయించారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలో ఏం చెప్పిందో ఈనాడులో వేయగలరా? 

రాజధాని రైతులకు చిత్తశుద్ధితో న్యాయం చేస్తాం. మీకేం కావాలో... మీకేం న్యాయం చేయాలో చెప్పండి.  అమరావతి రైతులు చంద్రబాబు ఉచ్చులో పడొద్దు. చంద్రబాబు బెదిరింపులకు భయపడేది లేదు. ఇప్పటికైనా ఆయన బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మానుకోవాలి. అన్ని కమిటీల నివేదిక పరిశీలన తర్వాతే రాజధానిపై నిర్ణయం. అన్ని అంశాలు అసెంబ్లీలో చర్చిస్తాం. రాజధాని రైతులకు గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదే అమలు చేస్తాం. లేదంటే ఆ రైతులు ఆలోచన మార్చుకుంటే చర్చిస్తాం. రాజధాని రైతులకు మేలు జరిగే పనులే చేస్తాం. మన స్వార్థాల కంటే... మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఏపీ ప్రజల అభివృద్ధి, శాంతి భద్రతలు ముఖ్యం.

 పవన్ కల్యాణ్ దేనికి కవాతు చేస్తారు..
విశాఖపట్నం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. హుద్ హుద్ తుఫాన్ సమయంలో టీడీపీ నేతలు రికార్డులు మాయం చేసి వేలాది ప్రభుత్వ భూములను దోచుకున్నారు. మా ప్రభుత్వం ఏర్పడి ఎన్ని నెలలు అయింది వైజాగ్ లో భూములు దోచుకోవడానికి. అశోకగజపతి రాజు ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్నపుడు సుజల స్రవంతి గుర్తుకు రాలేదా? తాతలు పేరు చెప్పుకుని అశోక గజపతి రాజు రాజకీయాలు చేస్తున్నారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తాం. పవన్ కల్యాణ్ దేనికి కవాతు చేస్తారు. ఆయనకు దేనిపైనా అయినా ఒక స్పష్టత అనేది ఉందా?  వైఎస్సార్‌ సీపీ ప్రజా ప్రతినిధులపై దాడులు పిరికి పంద చర్య. దాడులు ద్వారా చంద్రబాబు అరాచకాలు సృష్టిచాలని చూస్తున్నారు. ఎన్ని గొడవలు చేస్తున్న పోలీసులు సహనంతో వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి: సీఎం జగన్‌

వచ్చారు జగన్‌.. మెచ్చారు జనం

చంద్రబాబు చేతకాని చరిత్రహీనుడు

అమ్మఒడి..పేదింట చదువుకు భరోసా

పేద పిల్లల చదువుకు వెలుగు.. అమ్మఒడి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top