పేద పిల్లల చదువుకు వెలుగు.. అమ్మఒడి 

Shanta Sinha Comments About Amma Vodi - Sakshi

పథకం లక్ష్యం నెరవేరేలా పటిష్ట కార్యాచరణ అవసరం

అందుకోసం విద్యావ్యవస్థలో అందరినీ భాగస్వాముల్ని చేయాలి

విద్య పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేలా చూడాలి

బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ శాంతాసిన్హా 

సాక్షి, అమరావతి: పేదపిల్లలు బడిలో ఉండేలా చూసేందుకు ఉద్దేశించిన ‘అమ్మఒడి’ పథకం వంటివి గతంలో దేశంలో ఎక్కడా అమలుచేయలేదని, పేద కుటుంబాల్లోని పిల్లల విద్యకు ఆర్థికంగా ఏ సాయం చేసినా మంచిదేనని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ శాంతాసిన్హా అన్నారు. అదే సమయంలో.. నగదు బదిలీ చేసి వదిలేయకుండా పథకం లక్ష్యం నెరవేరేలా పటిష్ట కార్యాచరణ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు అధికారులతో పాటు తల్లిదండ్రుల కమిటీలు, పంచాయతీల్ని విద్యావ్యవస్థలో బాధ్యుల్ని చేయాలని సూచించారు. ‘జగనన్న అమ్మఒడి’ పథకంపై సోమవారం ఆమె సాక్షితో సంభాషించారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తే.. సామాజికంగా మనం ఆశించే మార్పులు సాధ్యమవుతాయని, అయితే ఇది ఏ ఒక్క రోజులోనో సాధ్యం కాదని.. నిరంతరాయంగా 20 ఏళ్లపాటు కొనసాగాలన్నారు. ‘అమ్మఒడి’ సహా విద్యా వ్యవస్థపై ఎంవీ ఫౌండేషన్‌ వ్యస్థాపకురాలిగా కూడా వ్యవహరిస్తున్న శాంతాసిన్హా పలు అభిప్రాయాలు పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే..

బడికెళ్లేలా చూడాల్సిన బాధ్యత అందరిదీ..
‘అమ్మఒడి’ పథకంపై తల్లుల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలి. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలకు ఈ బాధ్యత అప్పగించాలి. అప్పుడు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఏదో డబ్బులిచ్చారు? ఖర్చు చేద్దాంలే.. అనేలా ఉండకూడదు. పిల్లలు బడికెళ్లేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. స్కూళ్లు బాగా నడిస్తే పిల్లలు వారంతట వారే వస్తారు. విద్యావ్యవస్థపై ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండేలా చూడాలి. పైనుంచి కిందివరకు అందరినీ భాగస్వాముల్ని చేయాలి. పనిచేయకపోతే చర్యలు తీసుకోవాలి. ఎంఈవోలు, ఎంఆర్‌సీలు, సీఆర్సీలు, హెచ్‌ఎంలు, సబ్జెక్టు టీచర్లు ఇలా అందరూ పూర్థి స్థాయిలో ఉండి విద్యావ్యవస్థలో వారి విధుల్ని సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. ఇవన్నీ ఉన్నా.. పిల్లలు రాకపోతే అప్పుడు పిల్లల తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 

స్కూళ్ల అభివృద్ధికి ‘నాడు–నేడు’ దోహదం
స్కూళ్ల అభివృద్ధికి నాడు–నేడు కార్యక్రమం ఎంతో ప్రయోజనకరం. తల్లిదండ్రుల కమిటీలు, గ్రామ పంచాయతీల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలి. బడి బయట ఏ ఒక్క చిన్నారి ఉండడానికి వీల్లేదు. ప్రభుత్వ లక్ష్యం అదే కావాలి. పేరెంట్స్‌ కమిటీలు, గ్రామ పంచాయతీలకు కూడా బాధ్యత అప్పగించాలి. అవకాశం కల్పిస్తే పేద పిల్లలు బాగా చదవగలరన్నది సాధ్యం చేసి చూపించాలి. 

కార్పొరేట్‌ సంస్థల్ని రద్దు చేయాలి
విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్‌ కార్పొరేట్‌ సంస్థల్ని పూర్తిగా రద్దుచేయాలి. కార్పొరేట్‌ యాజమాన్యాలకు సొంత ప్రయోజనాలే తప్ప సామాజిక, సేవా దృక్పథం ఉండదు. అమెరికా, యూరోప్‌లో విద్య పబ్లిక్‌ సర్వీస్‌గానే ఉంది. విద్య ప్రభుత్వ బాధ్యత. ప్రైవేట్‌లో ఉండడం వల్లే అసమానతలు ఏర్పడుతున్నాయి. పిల్లలందరికీ చదువు చెప్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వాలి. తగినన్ని సెకండరీ, హయ్యర్‌ సెకండరీ స్కూళ్లను పెట్టాలి. నాణ్యమైన విద్యను అందించాలి. ఈ కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యా సంస్థల్ని బంద్‌ చేయిస్తే ప్రజలపై చదువు కోసం ఆర్థిక భారం ఉండదు. లాభాపేక్ష లేని ప్రైవేట్‌ సంస్థలకు పాఠశాలలు నడిపించే బాధ్యత అప్పగించాలి. 

ఫిర్యాదుల్ని పరిష్కరించేలా కమిషన్లు 
విద్యారంగంలో ప్రమాణాల కోసం కమిషన్ల ఏర్పాటు మంచి నిర్ణయమే. వాటిలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఉండాలి. ఎవరైనా తమకు సమస్య ఎదురైతే కమిషన్‌కు చెప్పుకుని పరిష్కారం పొందేలా చూడాలి. 

పంచాయతీలకు బాధ్యతలు అప్పగించాలి
ప్రభుత్వ విద్యా విధానంలో పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణ బాధ్యత చాలా ముఖ్యం. కేరళలో ఈ వ్యవస్థ బాగా పనిచేస్తోంది. అక్కడి ప్రభుత్వం పంచాయతీలకు పెద్ద పాత్ర ఇచ్చింది. అక్కడి నిపుణులను రప్పించి ఇక్కడ మార్పులు చేసినా మంచిదే.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top