నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి
సాక్షి, హైదరాబాద్: సమస్యలను ఆలోచనతో కూడిన కార్యాచరణతో పరిష్కరించడ మే నిజమైన కరుణ అని నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో తాను రచించిన ‘కరుణ– ది పవర్ ఆఫ్ కంపాషన్’ పుస్తకావిష్కరణ అనంతరం అక్కడ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చర్చలో కైలాశ్ సత్యార్థితో పాటు ప్రముఖ సామాజిక వేత్త డాక్టర్ శాంతా సిన్హా పాల్గొన్నారు. ‘కరుణ’పుస్తకాన్ని ప్రస్తావిస్తూ పుస్తకం రాసేందుకు ప్రేరణ, నేపథ్యం, ఇతర అంశాలపై ఆమె పలు ప్రశ్నలు అడిగారు.
వీటికి కైలాశ్ సత్యార్థి సమాధానమిస్తూ ఈ విధంగా స్పందించారు.బాల కార్మి క వ్యవస్థ నిర్మూలన, పిల్లల హక్కులు, విద్యా హక్కు, బానిసత్వం తదితర అంశాలపై దాదాపు నాలుగున్నర దశాబ్దాల పోరాటంలోని అనుభవాలను ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు వివరించారు. తన పుస్తకం గురించి వివరిస్తూ కరుణ అనేది మృదువైన భావోద్వేగం కాదని స్పష్టం చేశారు.
కరుణను దయ, జాలి, క్షమతో సమానంగా చూడడం పెద్ద పొరపాటని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నోబెల్ పురస్కారం అందుకునే సమయంలో తనతో ఓ విదేశీ జర్నలిస్టు మాట్లాడుతూ భారత దేశంలో ఎన్నో సమస్యలున్నాయని విమర్శించారని, దీనికి తాను బదులిస్తూ భారత్‌లో ఎన్నో సమస్యలున్నప్పటికీ... వాటికి పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయని బదులిచ్చినట్లు చెప్పుకొచ్చారు.
వేలాది బాల కార్మి కుల జీవితాలను దగ్గర నుంచి చూసిన అనుభవం తనకుందని, వాటి పరిష్కారానికి కేవలం భావోద్వేగ స్పందనలు సరిపోవన్నారు. ప్రపంచ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలు, డేటా వరకే పరిమితమైందని, ఇకపై కరుణను కూడా ప్రపంచీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ గ్లోబల్ కరుణ ఉద్యమం భారత్ నుంచే ప్రారంభమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


