చిచ్చురేపిన జాబితా.. కాంగ్రెస్‌కు ‘రెబెల్స్‌’ షాక్‌

Being rejected tickets, Congress Leaders to contest as Independent - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: కాంగ్రెస్‌ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితా.. పార్టీలో చిచ్చురేపుతోంది. టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు.. పార్టీ అధిష్ఠానానికి షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎంత తీవ్రంగా ప్రయత్నించినా తమకు టికెట్‌ దక్కపోవడంతో పలు నియోజకవర్గాల్లో నేతలు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తమకు మొండిచేయి చూపిన హస్తం పార్టీకి ప్రమాద ఘంటికలు మోగిస్తూ.. రెబెల్స్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం 20కిపైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీని అసమ్మతి జ్వాల వెంటాడుతోంది.

నెలన్నరపాటు సాగిన సుదీర్ఘ కసరత్తు అనంతరం కాంగ్రెస్‌ పార్టీ తాజాగా 65 మంది అభ్యర్థులతో తన తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అటు కాంగ్రెస్‌ మిత్రపక్షం టీడీపీ కూడా 9 మందితో తొలిజాబితాను విడుదల చేసింది. దీంతో మొత్తం 74 స్థానాల్లో మహాకూటమి అభ్యర్థుల ప్రకటించినట్టయింది. అయితే, ప్రకటించిన స్థానాల్లో 20 నియోజకవర్గాల్లో మహాకూటమికి సొంత నేతల నుంచి రెబెల్స్‌ బెడద తప్పేలా కనిపించడం లేదు. ఓవైపు ఢిల్లీలో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నా.. వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

మొండిచేయి చూపారు..!
తనకు టికెట్‌ ఇవ్వకుండా మొండిచేయి చూపారని కాంగ్రెస్‌ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే ముకుందరెడ్డి కోడలు గీట్ల సవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, మహిళల కోటాలో తొలి జాబితాలోనే తనకు టికెట్‌ ఇస్తానని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చినా.. అది నెరవేరలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే పెద్దపల్లి నియోజకవర్గం నుంచి సతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సవిత భావిస్తున్నారు.

నాయిని తిరుగుబాటు?
ఇప్పటికే పలువురు నేతలు అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్‌ వెస్ట్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌లో ఉండాలో లేదో బుధవారం నిర్ణయం తీసుకుంటానని నాయిని రాజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు నాయినికి టికెట్‌ కేటాయించాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు వరంగల్‌ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ భవన్‌పైకి ఎక్కిన ఓ మహిళా కార్యకర్త నాయినికి టికెట్‌ ఇవ్వకుంటే బిల్డింగ్‌పై నుంచి దూకేస్తానంటూ హెచ్చరిస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది.

తొలి జాబితాపై కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తుల నేతల జాబితాలో పెద్దసంఖ్యలో కనిపిస్తోంది. నియోజకవర్గాల వారిగా టికెట్‌ ఆశించి భంగపడిన పలువురు నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దూకేందుకు సిద్ధమవతున్నారు. నియోజకవర్గాల వారీగా అసంతృప్త నేతల జాబితా ఈ విధంగా ఉంది.

1) చెన్నూరు-దుర్గం భాస్కర్

2) మంచిర్యాల- అరవింద్ రెడ్డి
 
3) ముధోల్-నారాయణ్ రావు పటేల్
 
4) పెద్దపల్లి- ఈర్ల కొమురయ్య, బల్మూరి వెంకట్

5) కరీంనగర్-నేరేళ్ల శారద

6) మానకోండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ

7) వికారాబాద్- చంద్రశేఖర్

8) తాండూరు- రాకేష్

9) కంటోన్మెంట్- క్రిశాంక్

10) సూర్యాపేట-పటేల్ రమేష్ రెడ్డి

11) అచ్చంపేట్- చారుకొండ వెంకటేశ్

12) మునుగోడు-పాల్వాయి స్రవంతి

13) నకిరేకల్- ప్రసన్న రాజ్

14) స్టేషన్ ఘన్ పూర్ - విజయరామారావు

15) ములుగు- పోడెం వీరయ్య (భద్రాచలం టికెట్‌ కేటాయించడంపై కేడర్‌లో అసంతృప్తి)

16 ) ఆదిలాబాద్- భార్గవ్ దేశ్ పాండే

17) జడ్చర్ల-అనిరుద్ రెడ్డి

కూటమి పొత్తులో భాగంగా తెలంగాణ టీడీపీ ప్రకటించిన స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అసంతృప్త నేతలు పోటీకి సై అంటున్నారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. వరంగల్ వెస్ట్ నుంచి  నాయిని రాజేందర్ రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి భిక్షపతియాదవ్, మహబూబ్‌ నగర్ నుంచి ఉబేదుల్లా కొత్వాల్, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతిరెడ్డి, ఉప్పల్ నుంచి రాగిడి లక్ష్మా రెడ్డి రెబెల్స్‌గా బరిలోకి దిగాలని భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top