కుమ్మక్కు ‘పోటీ’కి తొలగిన ముసుగు | Sakshi
Sakshi News home page

కుమ్మక్కు ‘పోటీ’కి తొలగిన ముసుగు

Published Wed, Mar 27 2019 9:16 AM

In AP TDP, Janasena, Praja Shanrhi Parties Are Supporters Parties To Each Other - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పీసీసీ చీఫ్‌ రఘవీరా, మాజీ మంత్రి శైలజానాథ్‌ పోటీ చేస్తున్నారు. వీరు మినహా ఏ రాజకీయ పార్టీలో కూడా చెప్పుకోదగ్గ నేతలు పోటీలో లేరు. రఘువీరా పోటీలో ఉన్న కళ్యాణదుర్గం నుంచి టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరిని తప్పించింది. మరోనేత అమిలినేని సురేంద్రకు టిక్కెట్‌ ఇవ్వకుండా నామమాత్రపు పోటీగా ఉమామహేశ్వరరావును నిలిపింది. దీనికి కారణం రఘువీరాను గెలిపించడమే. కళ్యాణదుర్గంలో కాంగ్రెస్‌కు టీడీపీ సహకరించాలి, తక్కిన 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు టీడీపీకి సహకరిస్తారు.

టీడీపీ సర్వేలో 1.2శాతం కాంగ్రెస్‌కు ఓట్లు ఉన్నాయని తేలింది. నియోజకవర్గంలో 2లక్షల ఓట్లు పోలైతే 2,400 ఓట్లు కాంగ్రెస్‌కు పోలవుతాయనేది వారి లెక్క. దీంతో రఘువీరాకు సహకరిస్తే తక్కిన నియోజకవర్గాల్లో కనీసం 1500 ఓట్లు టీడీపీకి పోలవుతాయని, అవి గెలుపోటములును ప్రభావితం చేస్తాయనేది చంద్రబాబు ఆశ. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, ఎలాగూ యూపీఏలో చేరేందుకు టీడీపీ సిద్ధమైందని, తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకున్నామని, ఏపీలో కూడా పెట్టుకుందామని రఘువీరా చంద్రబాబును మొదట్లో సంప్రదించారని తెలుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ పొత్తును ఏపీ ప్రజలు హర్షించరని, ఇదే జరిగితే చాలా దారుణ ఫలితాలు ఉంటాయని చంద్రబాబు అభిప్రాయపడినట్లు సమాచారం. అందుకే లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘కొన్ని స్థానాల్లో మీకు సహకరిస్తాం.. తక్కిన స్థానాల్లో తమకు సహకరించాలని’’ చంద్రబాబు సూచించినట్లు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ‘అనంత’లో రఘువీరాకు టీడీపీ మద్దతిస్తోంది. అంతటితో టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు ఆగలేదు.

చంద్రబాబు అస్త్రమే ప్రజాశాంతి పార్టీ
కేఏ పాల్‌ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ వెనుక చంద్రబాబు ఉన్నారనేది స్పష్టమవుతోంది. ‘అనంత’లో వైఎస్సార్‌సీపీ నామినేషన్లు వేసిన 8 నియోజకవర్గాల్లో అచ్చం అవే పేర్లున్న వారితో కేఏ పాల్‌ నామినేషన్లు వేయించారు. వీరంతా ఎవరని ఆరా తీస్తే అంతా టీడీపీ వర్గీయులే. ఆ పార్టీలో సభ్యత్వం ఉన్నవాళ్లే. టీడీపీ నేతలు చెప్పిన వారికే కేఏ పాల్‌ బీఫారం ఇచ్చారంటే వైఎస్సార్‌సీపీని దెబ్బతీసే కుట్రతోనే ప్రజాశాంతి పార్టీని స్థాపించారని తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీని పోలిన కండువా, ఫ్యాన్‌ను పోలిన హెలికాప్టర్‌ గుర్తులతో ఓటర్లను తికమక పెట్టి వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చేలా టీడీపీ, ప్రజాశాంతి మధ్య ఒప్పందం జరిగిందని తెలుస్తోంది.

  • అనంతపురం అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన పగడి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరికి అనుచరుడు. డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు(టీడీపీ కార్పొరేటర్‌ విజయశ్రీ తండ్రి). ప్రజాశాంతి తరఫున నామినేషన్‌ వేశారు. 
  • రాయదుర్గంలో నామినేషన్‌ వేసిన ఉండాల రామచంద్రారెడ్డి డి.హీరేహాళ్‌ టీడీపీ మండల కన్వీనర్‌ హనమంతరెడ్డి చిన్నాన్న కుమారుడు. నామినేషన్‌లో ఇతన్ని ప్రతిపాదించింది కూడా హనుమంతరెడ్డి సోదరుడే. 
  • కదిరి అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన సన్నక సిద్ధారెడ్డి గాండ్లపెంట మండలం కురమామిడికి చెందిన టీడీపీ నేత. కందికుంట ప్రసాద్‌ అనుచరుడు. ఇటీవలే టీడీపీలో చేరిన గాజుల ప్రతాప్‌ బావమరిదే సిద్ధారెడ్డి.
  • ధర్మవరంలో నామినేషన్‌ వేసిన పెద్దారెడ్డిగారి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరుడు. చిగిచెర్ల గ్రామంలో టీడీపీ నాయకుడు.
  • వీరే కాదు రాప్తాడులో ప్రకాశ్, ఉరవకొండలో విశ్వనాథరెడ్డి, పెనుకొండలో ఎస్‌. శంకర్‌నారాయణ, కళ్యాణదుర్గంలో నేసే ఉషారాణి పేరుతో ప్రజాశాంతి తరఫున నామినేషన్లు వేసిన వారంతా టీడీపీ నేతలే. ఎమ్మెల్యే అభ్యర్థులతో నడుస్తున్న వారే.

జనసేన కూడా అందులో భాగమే..
జనసేన తరఫున కూడా పవన్‌ కళ్యాణ్‌ డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపారు. గుంతకల్లు టీడీపీ టిక్కెట్‌ ఆశించి భంగపడిన మధుసూదన్‌గుప్తా జనసేన అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. గుంతకల్లులో టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని, అసెంబ్లీ అభ్యర్థి ఓడిపోయినా పర్లేదు.. ఎంపీగా తన కుమారుడి ఫలితాలపై ప్రభావం ఉంటుందని జేసీ అప్రమత్తమయ్యారు. గుప్తా నివాసానికి వెళ్లి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గుప్తా ససేమిరా అనడంతో చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌కు ఫోన్‌ చేయించి గుప్తాను బరిలో నుంచి తప్పించేలా చూస్తున్నారని సమాచారం. దాదాపుగా గుప్తా నామినేషన్‌ ఉపసంహకరించుకుంటారని జేసీ వర్గీయులు చెబుతున్నారు. ఇలా కాంగ్రెస్, టీడీపీ, జనసేన, ప్రజాశాంతి పార్టీలు కలిసి కుమ్మక్కు రాజకీయం చేస్తున్న విషయం ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.  

Advertisement
Advertisement