మేనిఫెస్టోతో  మాయాజాలం

Ap cm chandrababu once again game with tdp manifesto - Sakshi

2014 మేనిఫెస్టోనే అమలుకు నోచుకోని వైనం  

1999 ఎన్నికల నుంచి చంద్రబాబుది అదే తీరు 

ప్రజలను మభ్యపెట్టేలా ఎన్నికల ప్రణాళిక.. ఆపై మొండిచేయి 

గత ఎన్నికల్లో 600కు పైగా హామీలిచ్చి అమలు చేయని టీడీపీ 

ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నవరత్నాలను కాపీ కొడుతూ కొత్త కార్యక్రమాలు 

2014 మేనిఫెస్టోలోని 600 హామీల్లో ఏ ఒక్కదాన్నీ పూర్తిగా అమలు చేయకున్నా, 2019 మేనిఫెస్టోలో వాటన్నిటినీ అమలు చేసినట్లు  పేర్కొనడం విచిత్రం. ఇంతలా ప్రజలను మోసగించడం ఒక్క చంద్రబాబుకు తప్ప మరొకరికి సాధ్యం కాదనేందుకు ఈ మేనిఫెస్టోలే సాక్ష్యం.  

సాక్షి, అమరావతి:  ఏ రాజకీయ పార్టీకి అయినా మేనిఫెస్టో ఒక పవిత్ర గ్రంథంలా ఉండాలి. అందులో ఏదైనా హామీని పొందుపర్చామంటే దాన్ని తప్పకుండా అమలు చేయాలి. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాత్రం తన మేనిఫెస్టోను ప్రజలను మభ్యపెట్టే మాయాజాలంగా మార్చేస్తుంటారు. ఆయన ఇచ్చే మేనిఫెస్టోలోని అంశాలను ఏనాడూ అమలు చేసిన పాపాన పోలేదు. 1994లో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్‌టీ రామారావును వెన్నుపోటు పొడిచి గద్దెదించిన తర్వాత ఎన్టీఆర్‌ అమలు చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించారు. రూ.2కే కిలోబియ్యం పథకానికి కూడా తూట్లు పొడిచి ధరను పెంచేశారు. 1999 ఎన్నికల మేనిఫెస్టోలో ‘‘..జన్మతః భారతీయులకే మనదేశంలో అత్యున్నత పదవులకు అర్హత ఉండేలా రాజ్యాంగ సవరణ కోసం కృషి చేయడం....’’  అన్న మరో అంశాన్ని చంద్రబాబు చేర్చారు. బీజేపీతో దగ్గరయ్యేందుకు నాటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని లక్ష్యంగా చేసుకొని ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో కూడా మోదీ సారథ్యంలోని ఎన్డీయేతో సంసారం కొనసాగిస్తున్నప్పుడు కూడా సోనియాగాంధీని ఇటలీ దెయ్యం, అవినీతి అనకొండ అని ఇలా పలు రకాలుగా విమర్శలు చేశారు. ఇప్పుడు 2019 ఎన్నికల ముంగిట ఒక్కసారిగా చంద్రబాబు మాటమార్చి కాంగ్రెస్‌తో పొత్తులు కుదుర్చుకొని సోనియా పంచన చేరారు. పార్టీ ఫిరాయింపులను నివారిస్తామంటూ చెప్పిన బాబే.. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలను కోట్ల కొద్దీ డబ్బు వెదజల్లి కొనుగోలు చేసి నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులకు దిగారు. 

2014, 2019 మేనిఫెస్టోలలోనూ మోసమే 
చంద్రబాబు.. గత ఎన్నికల సమయంలో దాదాపు 600కు పైగా హామీలను గుప్పించారు. ఎన్నికల్లో గెలిచాక వాటిని అమలు చేయకుండా వంచన చేశారు. రైతులకు బేషరతుగా రుణాల మాఫీ అని చెప్పి దానిపై కోటయ్య కమిటీని ఏర్పాటుచేసి నీరుగార్చారు. వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా రైతుల అప్పులపై పడే వడ్డీలకు కూడా సరిపోని విధంగా రూ.24 వేల కోట్లతో సరిపెట్టారు. ఇంకా 4, 5 విడతల మాఫీ నిధులు రానేలేదు. ప్రభుత్వ తీరు కారణంగా రైతులపై వడ్డీల భారం పెరిగి వాటిని తీర్చలేక వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణాల మాఫీ ఊసే లేకపోగా అన్నదాత సుఖీభవ అంటూ ఎన్నికలకు ముందు పథకాన్ని ప్రకటించి వారిని మభ్యపెడుతున్నారు. డ్వాక్రా, చేనేత రుణాల మాఫీని పూర్తిగా తుంగలో తొక్కారు. కోటయ్య కమిటీ తన నివేదికలో డ్వాక్రా రుణాలు మాఫీకి వీలుగా సిఫార్సు చేసినా చంద్రబాబు అమలు చేయలేదు. రుణాలు మాఫీ చేయనందున వాటిపై వడ్డీలు తడిసిమోపెడై మహిళలు బ్యాంకుల నుంచి నోటీసులు అందుకోవలసి వస్తోంది. బెల్టు షాపుల రద్దు,  ధరల స్థిరీకరణ నిధి, పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహలక్ష్మి పథకం కింద రూ.30 వేలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం వంటి హామీలు ఇచ్చినా ఏ ఒక్కటీ అమలు చేయలేదు. యువత, విద్యార్థులను కూడా మోసం చేశారు. ప్రతి ఏటా క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేస్తామని ప్రకటించి ఖాళీ పోస్టులను భర్తీచేయలేదు. పైగా ప్రభుత్వ ఉద్యోగులను 2 లక్షలకు పైగా కుదించి అన్యాయం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేకుంటే ప్రతినెల రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. ఇన్నాళ్లూ దీని ఊసే ఎత్తకుండా ఎన్నికలకు మూడు నెలల ముందు ‘యువనేస్తం’ అంటూ నిరుద్యోగులను మోసగించారు. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి, అన్న క్యాంటీన్లు.. ఎన్నికలకు ముందు మాత్రమే అదీ అరకొరగా అక్కడక్కడ అమలు చేస్తున్నారు. తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఉద్యోగాల భర్తీతో సహా పలు అంశాలపై మౌనం పాటించారు. 2014లో 52 పేజీలతో, ఇప్పుడు 32 పేజీల మేర మేనిఫెస్టో ఇచ్చినా తమకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదన్న విమర్శలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. 
 
హామీలూ కాపీయే 
చంద్రబాబు ఇతర పార్టీల మేనిఫెస్టోలను సైతం కాపీ కొట్టడంలో సిద్ధహస్తుడని నిరూపించుకున్నారు. గత ఏడాది జూలైలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. పెన్షన్లను రూ.2 వేలకు పెంచుతామని చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేలా పెన్షన్‌ను రూ.2 వేలు చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ పెన్షన్‌ను రూ.3 వేలు చేస్తామనగానే చంద్రబాబు కూడా రూ.3 వేలు చేస్తామని చేర్చారు. మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తామని నవరత్నాల్లో ప్రకటించగా చంద్రబాబు దాన్ని కాపీ కొట్టి సరిగ్గా ఎన్నికల ముందు మహిళలకు పసుపు కుంకుమ కింద రూ.10 వేలు అదీ నాలుగు విడతల్లో ఇస్తామని ముందస్తు చెక్కులు ఇచ్చారు. రైతులకు రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం కింద ఖరీఫ్‌లో ఇస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రకటించగా చంద్రబాబు అన్నదాత సుఖీభవ అంటూ దాన్నీ కాపీ కొట్టారు. దాన్ని కూడా పూర్తిగా కాకుండా అందులో కేంద్రం నుంచి వచ్చే రూ.6 వేలను కూడా కలిపేసి దాన్ని తన ఘనతగా ప్రకటించుకుంటున్నారు. 1999 చంద్రబాబు పాలనలో రేషన్‌కార్డు కావాలన్నా, పెన్షన్‌ కావాలన్నా పేదలు నానా అగచాట్లు ఎదుర్కొన్నారు. ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి మంజూరు చేసిన దారుణమైన పాలన సాగించారు. – సి. శ్రీనివాసరావు, సాక్షి, అమరావతి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top