షా వర్సెస్‌ రాహుల్‌

Amit Shah, Rahul Gandhi Face Off On Twitter - Sakshi

న్యూఢిల్లీ: భీమ్‌-కోరెగావ్‌ అల్లర్ల కేసు విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పాలక, ప్రతిపక్ష పార్టీల అధ్యక్షుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ట్విటర్‌ వేదికగా ఇరువురు అగ్రనేతలు వాగ్బాణాలు విసురుకున్నారు. కాంగ్రెస్‌ మూర్కత్వ పార్టీ అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొనడంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆయనకు దీటైన సమాధానం ఇచ్చారు.

‘మూర్కత్వానికి ఏదైనా ఒక స్థానం ఉందంటే అది కాంగ్రెసే. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న వారికి, మావోయిస్టులు, నకిలీ సామాజిక కార్యకర్తలకు, అవినీతి మూకలకు అది మద్దతు ఇస్తోంది. నిజాయితీగా పనిచేస్తున్న వారిపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తోంది. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌కు స్వాగతం’ అంటూ అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

దీనికి రాహుల్‌ గాంధీ దీటుగా జవాబిచ్చారు. ‘భారత దేశంలో ఒక ఎన్జీవోకు మాత్రం స్థానముంది. దాని పేరు ఆరెస్సెస్‌. ఇతర ఎన్జీవోలన్నింటినీ మూసివేయండి. హక్కుల కార్యకర్తలను జైళ్లలో పెట్టండి. ప్రశ్నించిన వారిని కాల్చిపారేయండి. నవ భారత్‌కు సుస్వాగతం’ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, అర్బన్‌ నక్సలిజంపై కాంగ్రెస్‌ వైఖరి స్పష్టం చేయాలని అమిత్‌ షా డిమాండ్‌ చేశారు. దేశ భద్రత అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న వారు క్షమాపణ చెప్పాలన్నారు. ఇదిలావుంటే భీమ్‌-కోరెగావ్‌ అల్లర్ల కేసులో వరవరరావు సహా పౌరహక్కుల నేతల గృహనిర్భందాన్ని మరో నాలుగు వారాల పాటు పొడిగిస్తూ సుప్రీంకోర్టు నేడు ఆదేశాలిచ్చింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top