
సాక్షి,అమరావతి: అధికారం కోల్పోయిన ఆరు నెలల్లోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు వికృతరూపం ప్రదర్శిస్తున్నారని, దీక్షల పేరుతో డ్రామాలాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన దివంగత ఎన్టీఆర్, పవన్ కల్యాణ్‌లను మించిన మహానటుడని వ్యాఖ్యానించారు. ఇసుకపై చేసిన దొంగదీక్షలో కారి్మకులు పలుగు, పారలు కెమెరాలో కనపడేలా ఎలా పట్టుకోవాలో డైరెక్షన్ ఇవ్వడం ప్రజలు గమనించారని, పవన్ కల్యాణ్‌తో సైతం బాగా నటింపజేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అంబటి మీడియాతో మాట్లాడారు.
కేసుల భయంతో పరార్...
పవన్, చంద్రబాబు పనిగట్టుకొని మత ప్రస్తావన తెస్తున్నారని అంబటి మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై హిందూ వ్యతిరేకి అనే ముద్రవేయాలని ప్రయత్నిస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిపాలన, రాజకీయాల్లో అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే పారదర్శక పాలన చూసి ఓర్వలేక కుట్ర రాజకీయాలు చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. 23 బాంబులు పెట్టినా భయపడలేదనే చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి అమరావతికి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీలు ఎక్కడి నుంచి ముడుతున్నాయో ప్రజలందరికీ బాగా తెలుసన్నారు. కాకినాడలో భవన నిర్మాణ కార్మికుడు చనిపోతే లోకేశ్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబు దూతగా ఢిల్లీకి పవన్
చంద్రబాబు తానా అంటే పవన్ తందానా అంటున్నారని అంబటి పేర్కొన్నారు. ఆయన సూచించిన వారికి టికెట్లు ఇచ్చి పవన్ జనసేనను సర్వనాశనం చేసుకున్నారని చెప్పారు. పవన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లారని భావించటం లేదని, చంద్రబాబు తన దూతగా ఆయన్ను పంపి ఉండవచ్చన్నారు.