ఆ నటులంతా కేవలం షో పీసులే : అమరీందర్‌ సింగ్‌

Amarinder Singh Slams Sunny Deol Over His Comments On Surgical Strikes - Sakshi

చండీగఢ్‌ : బాలీవుడ్‌ నటుడు, బీజేపీ ఎంపీ అభ్యర్థి సన్నీ డియోల్‌పై పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ విమర్శలు గుప్పించారు. సన్నీకి పరిఙ్ఞానం లేదని, ఆయనో షో పీస్‌ అంటూ మండిపడ్డారు. సన్నీ డియోల్‌ పంజాబ్‌లోని గురదాస్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన..‘  రాజకీయాలకు మాత్రమే నేను కొత్త. ప్రజాసేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడుల గురించి నాకు ఎక్కువగా తెలియకపోవచ్చు. అదేవిధంగా పాకిస్తాన్‌తో భారత్‌కు ఉన్న దౌత్యపరమైన సంబంధాల గురించి అంతగా అవగాహన లేకపోవచ్చు. ఒకవేళ నేను గెలిస్తే ఇటువంటి విషయాలపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటా. ప్రస్తుతానికైతే వీటిపై నాకు పూర్తి అవగాహన లేదు’ అని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో సన్నీ వ్యాఖ్యలపై స్పందించిన అమరీందర్‌ సింగ్‌.. ప్రధాని నరేంద్ర మోదీ, సన్నీ డియోల్‌, అతడి మారుతల్లి, బీజేపీ ఎంపీ హేమమాలిని లక్ష్యంగా విమర్శలు సంధించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ బాలాకోట్‌లో దాడులు చేశామంటూ మోదీ క్రెడిట్‌ కొట్టేయాలని చూస్తుంటే.. ఈ వ్యక్తి(సన్నీ)కి పాపం కనీసం అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదట. జాతీయ భద్రతపై దృష్టి సారించాం అంటూ బీజేపీ పదే పదే చెబుతుంది. అయితే సన్నీ మాటలు వింటుంటే ఆ పార్టీ అభ్యర్థుల ఆలోచనా సామర్థ్యం ఏమిటో అర్థమవుతోంది. ఇక బీజేపీ ఎంపీ హేమమాలిని ఐదేళ్లుగా మథురకు ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ ఒక్కరోజు ప్రజల తరఫున లోక్‌సభలో తన గొంతు వినిపించలేదు. ఇటువంటి నటులంతా కేవలం షోపీసులే’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

చదవండి : బాలాకోట్ ఎటాక్‌ : న్యూ ట్విస్ట్‌

కాగా సార్వత్రిక ఎన్నికల వేళ పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్‌ ఉగ్ర శిబిరాలపై జరిపిన మెరుపు దాడుల బీజేపీ నాయకులు ప్రచారాస్త్రంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు మాత్రం బాల్‌కోట్‌ ఉదంతంపై విమర్శలు గుప్పిస్తూ, ఆధారాలు చూపాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటలీ జర్నలిస్ట్ ఫ్రాన్సెస్కా మెరినో.. భారత వైమానిక దళం జరిపిన దాడిలో 130-170 మంది వరకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయారంటూ వివరణాత్మక కథనం వెలువరించి సంచలనం రేపారు. పాకిస్తాన్‌ ఈ విషయంలో వాస్తవాలను దాచిపెట్టి ప్రపంచాన్ని మోసం చేయాలని చూస్తోందని ఆమె మండిపడ్డారు. ఖాళీ ప్రదేశంలో దాడి చేసినట్లు పాకిస్తాన్  పేర్కొందనీ, ఎలాంటి  ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని తన కథనంలో మెరినో ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top