ఇది కచ్చితంగా హత్యే: అఖిలేశ్‌ యాదవ్‌

Akhilesh Yadav Slams UP Govt Calls Nathuram Raj - Sakshi

లక్నో : రాష్ట్రంలో నడిచేది రామరాజ్యం కాదని.. నాథూరాం రాజ్యం అంటూ ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ యోగి సర్కారుపై విమర్శలు గుప్పించారు. మూక హత్యలతో పాటు ఇప్పుడు పోలీసుల చేతిలో పౌరుల హత్యలు కూడా సాధారణం అయిపోయాయంటూ మండిపడ్డారు. వారం రోజుల క్రితం పోలీసుల కాల్పుల్లో మరణించిన ఇసుక వ్యాపారి పుష్పేంద్ర యాదవ్‌ కుటుంబాన్ని బుధవారం అఖిలేశ్‌ యాదవ్‌ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘ ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి విషయంలో ఏం జరిగింది. చిన్మయానంద్‌ చేతిలో బలైన బాధితురాలికి ఏం న్యాయం జరిగింది. ఆమెకు ప్రమాదం జరిగితే.. ఏకంగా ఈమెను జైలుకు పంపించారు. ఇదెక్కడి న్యాయం. యూపీలో రామరాజ్యం కాదు.. నాథూరాం రాజ్యం నడుస్తోంది. పోలీసులు కూడా హత్యలు చేయడం ప్రారంభించారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుష్పేంద్ర యాదవ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాగా ఇసుక వ్యాపారం చేసే పుష్పేంద్ర యాదవ్‌ను ఆదివారం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు పుష్పేంద్ర కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయనకు సంబంధించిన ట్రక్కును సీజ్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తనపై ట్రక్కు ఎక్కించి చంపేందుకు కుట్ర చేయడంతో ప్రాణరక్షణ కోసం పుష్పేంద్రపై కాల్పులు జరిపానని పోలీసు ఇన్స్‌పెక్టర్ మీడియాకు తెలిపారు. అయితే సదరు పోలీసు అధికారి పుష్పేంద్రను లక్షా యాభై వేల రూపాయలు లంచం ఇవ్వాల్సిందిగా బెదిరించారని.. ఈ నేపథ్యంలో తన బండారం బట్టబయలు చేస్తానంటూ పుష్పేంద్ర వార్నింగ్‌ ఇవ్వడంతో తనను కాల్చి చంపేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానీ పోలీసు ఉన్నతాధికారులు వీటిని కొట్టిపారేశారు.

ఇక ఈ విషయం గురించి అఖిలేశ్‌ మాట్లాడుతూ.. పోలీసులు చెప్పేదంతా కట్టుకథ.. పుష్పేంద్ర యాదవ్‌ది కచ్చితంగా హత్యేనని వ్యాఖ్యానించారు. యూపీ పోలీసు వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద తనకు ఏమాత్రం నమ్మకం లేదని.. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో ఈ కేసు విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కాగా అఖిలేశ్‌ వ్యాఖ్యలను అధికార బీజేపీ ఖండించింది. ఓటు బ్యాంకు కోసం అఖిలేశ్‌ ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శల దాడికి దిగింది. ‘ ఆయనకు ఇసుక మాఫియా, తన కులం వారి మీద అమితమైన ప్రేమ ఉంది. అందుకే ఎన్‌కౌంటర్‌ను హత్య అంటున్నారు. ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా తీరు మార్చుకోవడం లేదు’ అంటూ బీజేపీ నేత సిద్దార్థ్‌ సింగ్‌ విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top