తలొగ్గిన పాక్‌.. రేపు అభినందన్‌ విడుదల

Wing Commander Abhinandan Varthaman to release from PAK tomarrow - Sakshi

ఇస్లామాబాద్‌ : భారత్‌ ఒత్తిడికి పాకిస్తాన్‌ తలొగ్గింది. భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ వర్థమాన్‌ను పాక్‌ చెర నుండి విడిపించడానికి అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిగా చేస్తూ ఒత్తిడి చేయడంలో భారత్‌ పైచేయి సాధించింది. విక్రమ్‌ అభినందన్‌ను రేపు విడుదల చేస్తామని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, కుదరలేదని పేర్కొన్నారు.  శాంతి చర్యల్లో భాగంగా అభినందన్‌ను విడుదల చేస్తామని తెలిపారు.

కాగా, భారత పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ను విడిపించుకోవడానికి పాకిస్తాన్‌తో ఎలాంటి ఒప్పందం​ చేసుకోబోమని, బేషరతుగా వెంటనే అభినందన్‌ను పాక్‌ భారత్‌కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను విడుదల చేయాలని భారత్‌, పాక్‌పై ఒత్తిడి తెచ్చింది. అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించి గాయపడిన జవాన్‌ను వీడియోలో చిత్రీకరించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం పాకిస్తాన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ సయ్యద్‌ హైదర్‌ షాను పిలిపించుకున్న విదేశాంగశాఖ తమ నిరసనను తెలిపింది. జాతీయ భద్రతా విషయంలో కఠిన, నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు వెనకాడ బోమని తేల్చి చెప్పింది.  అభినందన్‌ విడుదల విషయంలో పాక్‌తో ఎలాంటి చర్చలు కానీ, ఒప్పందాలు కానీ ఉండబోవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అభినందన్‌ విషయంలో కాందహర్‌ విమానం హైజాక్‌ ఘటన తరహాలో ఇచ్చిపుచ్చుకునేవీ ఏమీ ఉండవని తెలిపింది. 

పాక్‌ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాదులు, వారి ముసుగులపై పాకిస్తాన్‌ సత్వరమే తగిన చర్య తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే 40మందిని పొట్టనబెట్టుకున్న పూల్వామా ఉగ్రవాద దాడికి సంబంధించిన ఆధారాలను పాక్‌ రాయబారికి భారత్‌ అందజేసింది. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన మాట నిలబెట్టుకోవాలని, భారత్‌ ఇచ్చిన ఆధారాలపై దర్యాప్తు జరపాలని కేంద్రం పేర్కొంది. భారత్‌ పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేసిందని, కానీ, పాకిస్థాన్‌ భారత్‌లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకొని దాడికి ప్రయత్నించిందని కేంద్రం గుర్తు చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top