
పులులను కాపాడుకుందాం
పులుల సంరక్షణకు అన్ని దేశాలు ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఆసియా దేశాల సదస్సులో ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: పులుల సంరక్షణకు అన్ని దేశాలు ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రకృతి, పులుల సంరక్షణకు తీసుకునే చర్యలు అభివృద్ధికి ఏమాత్రం విఘాతం కాకూడదని, ఈ రెండు సమాంతరంగా ముందుకుసాగాలని అన్నారు. పులుల అవయవాల స్మగ్లింగ్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలన్నీ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ పులుల సంరక్షణపై 3వ ఆసియా దేశాల మంత్రుల స్థాయి సదస్సును మోదీ ప్రారంభించారు. ‘ప్రకృతి, పులులను సంరక్షణకు తీసుకునే చర్యలు అభివృద్ధిని కుంటుపరుస్తాయన్న దురభిప్రాయం ఉంది. ఈ రెండింటిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేలా వ్యూహాలు రచించాలి. వన్య ప్రాణులు లేకుండా అడవి, అడవి లేకుండా వన్యప్రాణులు మనలేవు.
ఈ రెండింటినీ వేరు చేయలేం. ఒకదాన్ని ధ్వంసం చేస్తే మరొకటి ధ్వంసమవుతుంది. ప్రస్తుతం అన్ని దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న వాతావరణ మార్పు అంశాన్ని ఈ కోణంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. పులుల వేట, వాటి అవయవాలతో అక్రమ వ్యాపారం కారణంగా పలు దేశాల్లో పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాల స్థాయిలో చర్యలు చేపట్టేందుకు ముందుకు రావాలన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. భారత్‌లో పులుల సంరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఫలితంగా 2014లో 2,226గా ఉన్న పులుల సంఖ్య 2,500కు పెరిగిందన్నారు.
14న ఆన్‌లైన్ అగ్రి మార్కెట్ షురూ
ఆన్‌లైన్ వ్యవసాయ మార్కెట్‌ను ఈ నెల 14న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ ‘ప్లాట్‌ఫామ్’కు 585 హోల్‌సేల్ మార్కెట్లను అనుసంధానం చేయనున్నారు. రైతు తాను పండించిన పంటను దేశంలోని ఏ మార్కెట్‌లో అయినా అమ్ముకునేలా ఈ ‘ఈ-ప్లాట్‌ఫామ్’ ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది. 2022లోగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం దీని ఉద్దేశమంది.