వాళ్లిద్దరూ కలిసి పనిచేయాలి 

US President Donald Trump comments On India And Pak about Kashmir Issue - Sakshi

కశ్మీర్‌పై మోదీ, ఇమ్రాన్‌ చర్చించుకోవాలి: ట్రంప్‌ l

నిర్దిష్టచర్యలు తీసుకుంటేనే పాక్‌తో చర్చలు: మోదీ

న్యూయార్క్‌: కశ్మీర్‌ సమస్య పరిష్కారంలో భారత్, పాక్‌ ప్రధానులిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే, పాక్‌తో చర్చలు జరపాలంటే ముందుగా ఆ దేశం నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఐరాస సమావేశాల అనంతరం మంగళవారం ట్రంప్, భారత ప్రధాని మోదీ మరోసారి భేటీ అయ్యారు. అనంతరం మోదీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్‌లు అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ సోమవారం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌తో భేటీ అనంతరం ప్రకటించిన ట్రంప్‌ ఈ విషయమై అడిగిన ప్రశ్నకు స్పందించారు.. ‘కశ్మీర్‌ విషయంలో పొరుగుదేశాల నేతలిద్దరూ కలిసి చర్చించుకుంటే బాగుంటుంది. వారు చాలా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశముందని భావిస్తున్నా’ అని అన్నారు. పాక్‌ గడ్డపై ఉగ్ర స్థావరాలు, సైన్యానికి ఉగ్ర లింకులపై భారత విలేకరి అడిగిన ప్రశ్నపై ట్రంప్‌.. ‘మీకు చాలా సమర్థుడైన ప్రధాని ఉన్నారు. అవన్నీ ఆయన చూసుకుంటారు’ అని బదులిచ్చారు. భారత్‌– అమెరికాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతానికి త్వరలోనే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నామన్నారు. ‘మోదీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రజలకు మోదీ ఎంతో అభిమానం. భారతీయులకు ఎల్విస్‌ ప్రెస్లీ లాంటి వారు’ అని హ్యూస్టన్‌లో ఆహూతులు చూపిన అభిమానాన్ని ఉద్దేశించి ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఆయనకు హౌడీ మోదీ కార్యక్రమం ఫొటోను బహూకరించారు.   

భారత్‌కు రండి!
ట్రంప్‌ను ఆహ్వానించిన మోదీ 
కశ్మీర్‌ విషయంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ తో చర్చలు జరగాలంటే ముందుగా ఆ దేశం నిర్దిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉందని భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదం కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. కుటుంబంతో భారత్‌కు రావాలని ట్రంప్‌ను మోదీ మరోసారి ఆహ్వానించారు. వాణిజ్యం, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం తదితర అంశాలపై ఇద్దరు నేతలు 40 నిమిషాల పాటు చర్చించారు. కశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా గత 30 ఏళ్లలో 42వేల మందికి పైగా చనిపోయారని ట్రంప్‌కు ప్రధాని వివరిం చారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే ఢిల్లీలో మీడియాకు తెలిపారు. కనీస భద్రత మధ్య మోదీ 2015లో లాహోర్‌లో పర్యటించారనీ, ఆ వెంటనే పఠాన్‌కోట్‌పై సైనిక స్థావరంపై ఉగ్ర దాడి జరిగిందని వివరించారన్నారు. 

ఉగ్రదాడులన్నీ ఒకటే! 
మంచి, చెడు.. చిన్న, పెద్ద ఉండదు: మోదీ
మంచి, చెడు.. చిన్న, పెద్ద.. అంటూ ఉగ్రవాద దాడులను వర్గీకరించడం సరికాదని మోదీ అన్నారు. ప్రపంచంలో ఎక్కడ జరిగినా, ఏ స్థాయి దాడైనా.. ఉగ్రదాడిని ఉగ్రవాద చర్యగానే పరిగణించాలని ప్రపంచదేశాలకు స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదంపై నాయకుల వ్యూహాత్మక స్పందన’ అంశంపై ఐక్యరాజ్యసమితిలో మంగళవారం జరిగిన శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ప్రపంచదేశాలు పరస్పర సహకారాన్ని వివిధ స్థాయిల్లో వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో మిత్ర దేశాలతో కలిసి పనిచేసేందుకు, ఆయా దేశాల సామర్ధ్య పెంపులో సహకరించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. అలాగే, ఉగ్రవాదులు నిధులు, ఆయుధాలు సమకూర్చుకోకుండా చూడాల్సి ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు సహకారం, సమాచార పంపిణీ.. తదితరాలపై ద్వైపాక్షిక, ప్రాంతీయ ఒప్పందాలను ఏర్పర్చుకోవాల్సి ఉందన్నారు. ఉగ్రవాద, తీవ్రవాద భావజాలాల్ని ఎదుర్కొనేందుకు భారత్‌ ప్రజాస్వామ్య విలువలు, భిన్నత్వంపై గౌరవం, సమ్మిళిత అభివృద్ధి మొదలైన కీలక ఆయుధాలను ఉపయోగిస్తోందని మోదీ వివరించారు. ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి ఐరాస ఆంక్షలు, ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌.. మొదలైన వాటిని రాజకీయం చేయొద్దని సూచించారు. ఆన్‌లైన్‌లోని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, సమర్ధించే సమాచారాన్ని తొలగించేందుకు ఉద్దేశించిన క్రైస్ట్‌చర్చ్‌ పిలుపునకు మోదీ మద్దతు పలికారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top