‘నన్ను చంపేస్తారు.. అందుకే విగ్రహాలు చేయించా’

TMC MLA Builds Own Statues For People Remember Him After Death - Sakshi

కోల్‌కతా : చంపేస్తారనే భయంతో తన విగ్రహాలను తయారు చేయించిపెట్టుకున్నారు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌. తాను చనిపోయిన తర్వాత ప్రజలు తనను మర్చిపోవద్దనే ఉద్దేశంతో విగ్రహాలను తయారు చేయించానని చెబుతున్నారు. సౌత్ 24 పర్గానాస్ జిల్లాలోని గోసాబా నియోజవర్గ ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌(71) మూడేళ్ల క్రితం కోల్‌కతాలో పేరుగాంచిన శిల్పితో రెండు విగ్రహాలను తయారు చేయించుకున్నారు. ఫైబర్‌ గ్లాస్‌తో తయారు చేయించిన ఈ విగ్రహాలను తన ఇంట్లో భద్రంగా దాచుకున్నారు.

అయితే ఇటీవల తన నివాసంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విగ్రహాల విషయం బహిర్గతమైంది. ఈ విగ్రహాల ఫోటోలు వైరల్‌ కావడంతో ఆయన ఈ విషయంపై స్పందించారు. తనకు ప్రాణహాని ఉందని, తాను హత్యకు గురై చనిపోతే.. ప్రజలను మర్చిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాలను తయారు చేయించానని చెప్పుకొచ్చారు.

‘గతంలో నలుగురు హంతకులు అలిపోర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వారు మళ్లీ పట్టుబట్టారు. వారిని విచారించగా.. నన్ను చంపేందుకు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. లోకల్‌ లీడర్లే నన్ను హత్య చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నాకు జిల్లా ఎస్పీ ప్రవీణ్‌ త్రిపతి చెప్పారు. దీంతో నాకు ‘వై’ కేటగిరి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నాకు ప్రాణహాని ఉంది. ఏ క్షణంలోనైనా నేను హత్యకు గురికావొచ్చు. నేను చనిపోయిన తర్వాత ప్రజలు నన్ను మర్చిపోవద్దు. అందుకే విగ్రహాలు తయారు చేయించా‘ అని ఎమ్మెల్యే నాస్కర్‌ అన్నారు. తనకు టీఎంసీలోనే ఎక్కువ శత్రువులు ఉన్నారని, వారంతం ఇంతకు ముందు ఇతర పార్టీలో ఉండేవారని చెప్పుకొచ్చారు. జయంత్‌కు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top