ఏడాదిలో ముగ్గురు మాజీ సీఎంల కన్నుమూత

Three Former Delhi Chief Ministers Died In Less Than A Year - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మరణంతో యావత్‌ దేశం దిగ్ర్భాంతికి లోనయింది. తీవ్ర గుండెపోటుతో ఎయిమ్స్‌లో మంగళవారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో ఆమె కన్నుమూశారు. తన రాజకీయ జీవితంలో కీలక పదవులు చేపట్టి వాటికి వన్నెతెచ్చిన సుష్మా స్వరాజ్‌ ఢిల్లీ తొలి మహిళా సీఎంగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు.

కాగా ఏడాది వ్యవధిలో ముగ్గురు ఢిల్లీ మాజీ సీఎంలు మదన్‌లాల్‌ ఖురానా, షీలా దీక్షిత్‌, సుష్మా స్వరాజ్‌లు మరణించడం గమనార్హం. ఢిల్లీ మూడవ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బీజేపీ నేత మదన్‌లాల్‌ ఖురానా 2018, అక్టోబర్‌ 27న సుదీర్ఘ అనారోగ్యంతో 82 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 1993-96 మధ్య ఖురానా ఢిల్లీ సీఎంగా వ్యవహరించారు.

ఇక కాంగ్రెస్‌ దిగ్గజ నేత షీలా దీక్షిత్‌ (81) ఈ ఏడాది జులై 20న ఢిల్లీలోని ఫోర్టిస్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అత్యధిక కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ 2004లో కేరళ గవర్నర్‌గానూ సేవలు అందించారు. జీవితాంతం కాంగ్రెస్‌ నేతగానే కొనసాగిన షీలా 1984లో రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. యూపీలోని కన్నౌజ్‌ ఎంపీగానూ పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు.

మరో ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్‌ (67) ఆకస్మిక మరణం అటు దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా ప్రజలను విషాదంలో ముంచెత్తింది. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సుష్మా స్వరాజ్‌ 1998లో ఢిల్లీ తొలి మహిళా సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టారు. పార్టీలకు అతీతంగా  అందరికీ ఆప్తురాలయిన సుష్మా హఠాన్మరణం ఆమె సన్నిహితులకు, అభిమానులకు దిగ్భ్రాంతిని కలిగించింది.

ముఖ్యంగా ఆర్టికల్‌ 370 రద్దు విజయంతో సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలు, శ్రేణులకు ఈ వార్త అశనిపాతమైంది. సుష్మాస్వరాజ్‌కు భర్త స్వరాజ్‌ కౌశల్, కూతురు బన్సురి ఉన్నారు. 2016లో సుష్మాస్వరాజ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ అనారోగ్యం కారణంగా చూపి ఆమె పోటీ చేయలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top