తీవ్రవాదులు చొరబడ్డారా...? | Terrorists Tension in Nagai Tamil nadu | Sakshi
Sakshi News home page

తీవ్రవాదులు చొరబడ్డారా...?

Apr 25 2019 10:39 AM | Updated on Apr 25 2019 10:39 AM

Terrorists Tension in Nagai Tamil nadu - Sakshi

వేదారణ్యంలో గస్తీ

నాగైలో టెన్షన్‌ రంగంలోకి ఏడీజీపీ గస్తీ ముమ్మరం

సాక్షి, చెన్నై: శ్రీలంకలో తప్పించుకున్న తీవ్రవాదులు తమిళనాడులోకి చొరబడ్డారా.? అన్న అనుమానాలు బయలుదేరాయి. శ్రీలంకకు సమీపంలో ఉన్న నాగపట్నం జిల్లా సముద్ర తీరంలో ఆగమేఘాల మీద గస్తీని ముమ్మరం చేశారు. సముద్ర తీర భద్రతా విభాగం అదనపు డీజీపీ వన్నియ పెరుమాల్‌ సైతం రంగంలోకి దిగారు.

శ్రీలంకలో ముష్కరులు సాగించిన మారణ హోమం గురించి తెలిసిందే. ఇందులో మూడు వందల మందికి పైగా మరణించారు. ఈ ఘటన తదుపరి ముష్కరులు తమిళనాడు గుండా భారత్‌లోకి ప్రవేశించవచ్చన్న సమాచారం వెలువడింది. దీంతో సముద్ర తీర భద్రతా విభాగం, కోస్టుగార్డ్, నౌకాదళం, వైమానిక దళం భద్రతను కట్టుదిట్టం చేసింది. సముద్రంలో గస్తీని ముమ్మరం చేశారు. చెన్నై నుంచి కన్యాకుమారి వరకు సముద్ర తీరంలో అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులో బుధవారం నాగపట్నం జిల్లాలోని వేదారణ్యం, కోడియకరై, ఆరుకాట్టు తొరై తీరాల్లో సముద్ర తీర భద్రతా విభాగం హడావుడి పెరిగింది. అన్ని మార్గాల్లో గస్తీని, తనిఖీల్ని ముమ్మరం చేశారు. గతంలో అనేకసార్లు ఈ తీరాల్లోని నిర్మానుష్య ప్రదేశాలకు అనుమానిత పడవలు వచ్చి ఒడ్డుకు చేరడం, అనుమానితులు రాష్ట్రంలోకి వచ్చినట్టుగా పాద ముద్రలు ఉండటం వెలుగు చూసింది. ఈ దృష్ట్యా, ఈ తీరాన్ని అసరాగా చేసుకుని ముష్కరులు రాష్ట్రంలోకి చొరబడ్డారా అన్న ఉత్కంఠను రేపే దిశగా తనిఖీలు సాగాయి. సముద్ర తీర భద్రతా విభాగం అదనపు డీజీపీ వన్నియ పెరుమాల్‌ సైతం రంగంలోకి దిగారు. సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, భద్రతను పర్యవేక్షించడం గమనార్హం. కాగా, శ్రీలంకలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ రామేశ్వరం, తిరునల్వేలి, తూత్తుకుడిల్లో జాలర్లు చేపల వేటకు దూరంగా బుధవారం  గడిపారు.

ఆందోళనతో చెన్నైకు డీఎంకే నేత
శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల సమయంలో తిరుప్పూర్‌ ఉత్తరం జిల్లా డీఎంకేకార్యదర్శి సెల్వరాజ్, పార్టీ నేతలు రాందాసు, రాజమోహన్, కుమార్, సెందూర్, ముత్తు, మణి, మురుగన్‌లు కొలంబోలో ఉన్నారు. ఎన్నికల అనంతరం వీరు కోయంబత్తూరు మీదుగా కొలంబోకు 20వ తేదీ రాత్రి విమానంలో వెళ్లారు. రాత్రి బసచేసిన అనంతరం ఉదయాన్నే తాము బస చేసి ఉన్న హోటల్‌లో టిఫిన్‌ చేయడానికి సిద్ధం అయ్యారు. పై అంతస్తులో ఉన్న వీరు కిందకు వచ్చేందుకు సిద్ధ పడ్డ సమయంలో హఠాత్తుగా బాంబు పేలింది. అయితే, అదృష్టవశాత్తు వీరికి ఏమీ కాలేదు. దీంతో కొలంబో నుంచి మంగళవారం రాత్రి తిరుప్పూర్‌కు చేరుకున్నారు. బుధవారం మీడియాతో సెల్వరాజ్‌ పేర్కొంటూ, తమ గది నుంచి బయటకు వచ్చే యత్నం చేశామని, ఆ సమయంలో హఠాత్తుగా బాంబు పేలడం, స్విమింగ్‌ పూల్‌లో ఉన్న నీళ్లు ఉవ్వెత్తున ఎగసిపడటం చోటు చేసుకుందన్నారు. అక్కడ ఏమి జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళన చెందామని, కాసేపటి తర్వాత తమను అక్కడి నుంచి మరో హోటల్‌కు తీసుకెళ్లారన్నారు. తనకు జ్వరం సైతం రావడంతో ఆసుపత్రిలో చేర్పించారని, అక్కడి తమిళ నర్సుల ద్వారానే తనకు వరుస బాంబు పేలుళ్ల గురించి తెలిసిందన్నారు. ఎంతో ఆనందంగా అక్కడకు వెళ్లామని, అయితే, ఇక్కడకు తీవ్ర ఆందోళనతో తిరిగి వచ్చామన్నారు. ఆ దేవుడే తమను రక్షించాడని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement