తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆయన శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, అనంతరం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. జయలలిత జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో ఆయన తిరుమలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి, లడ్డూప్రసాదాలు అందజేశారు. తర్వాత ఆలయ రంగనాయక మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు.