రాజ్యాంగ బద్ధతపై విచారిస్తాం

Supreme Court says no stay on Citizenship Amendment Act - Sakshi

పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ

చట్టం అమలుపై స్టేకు నిరాకరణ

చట్టంపై సామాన్యులకు అవగాహన కల్పించాలని కేంద్రానికి ఆదేశాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణమైన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) రాజ్యాంగ బద్ధతపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, ఆ చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులను ఎదుర్కొని డిసెంబర్‌ 31, 2004లోపు భారత్‌కు వలస వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్, జైన్, పార్శీ, బౌద్ధ మతస్తులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు ఇటీవలే పార్లమెంట్‌ ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారిన విషయం తెలిసిందే.

ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదని, మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. అనంతరం, చట్టం రాజ్యాంగబద్ధతపై విచారణ జరుపుతామని పేర్కొంది. వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది.

సీఏఏపై ప్రజలకు అవగాహన కల్పించాలని విచారణ సందర్భంగా న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ చేసిన సూచనను ధర్మాసనం సమర్థించింది. ‘చట్టం లక్ష్యాలను, నియమనిబంధనలను, చట్టంలోని కీలకాంశాలను ప్రజలకు వివరించండి. అందుకు దృశ్య, శ్రవణ మాధ్యమాలను ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలించండి’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను ఆదేశించింది. అందుకు వేణుగోపాల్‌ అంగీకరించారు.

చట్టం అమలును అడ్డుకోవాలని ఒక పిటిషనర్‌ తరఫు న్యాయవాది జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్‌ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనాన్ని కోరారు. అస్సాం ఆందోళనల్లో ఐదుగురు విద్యార్థులు చనిపోయారన్నారు. అయితే, నోటిఫై చేసిన తరువాత చట్టంపై స్టే విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత తీర్పులను ప్రస్తావిస్తూ అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్, కపిల్‌ సిబల్‌లు చట్టం అమలుపై విధివిధానాలు రూపొందలేదని, అమలుపై ఆందోళన అవసరం లేదన్నారు. దాంతో చట్టం అమలుపై స్టే విధించడానికి కోర్టు నిరాకరించింది.

‘పౌర’ ఆందోళనలు చరిత్రలో నిలుస్తాయి: కన్హయ్య
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆందోళనల్లో జేఎన్‌యూ విద్యార్థి సంఘ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ పాల్గొన్నారు. యూనివర్సిటీ 7 వ నెంబర్‌ గేట్‌ వద్ద విద్యార్థులు, ఇతర నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ జరిపే నిరసనలు ముస్లింలను రక్షించడానికి కాదని, మొత్తం దేశాన్ని రక్షించేందుకని వ్యాఖ్యానించారు.

పౌరసత్వ చట్టం కన్నా జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) మరింత ప్రమాదకరమైందని స్పష్టం చేశారు. ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు రాజ్యాంగాన్ని పరిరక్షించిన వాటిగా చరిత్రలో నిలిచిపోతాయి’ అన్నారు. ‘ఎన్నార్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తే.. మనమంతా నోట్ల రద్దు సమయంలో నిల్చున్నట్లు భారీ లైన్లలో నిల్చుని మన పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది’ అన్నారు. పశ్చిమబెంగాల్‌లోని దినాజ్‌పూర్‌ జిల్లాలో సీఏఏ నిరసన ప్రదర్శనపై దుండగులు నాటు బాంబులు విసరడంతో ఐదుగురు గాయపడ్డారు.    

మద్రాస్‌ వర్సిటీకి కమల్‌ హాసన్‌:  మద్రాస్‌ వర్సిటీలో దర్నా చేస్తున్న విద్యార్థులకు సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ సంఘీ భావం తెలిపారు. క్యాంపస్‌ లోపలికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో, వెలుపలి నుంచే విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.  

జామియా కేసు చీఫ్‌ జస్టిస్‌కు బదిలీ
జామియా మిలియాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా రక్షణ కల్పించాలని  ఇద్దరు విద్యార్థినులు పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. జామియా వర్సిటీ విద్యార్థినులు లడీదా ఫర్జానా, ఆయేషా రీనా పెట్టుకున్న పిటిషన్‌  వేశారు. అయితే, సీఏఏ వ్యతిరేక హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులను హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులే విచారించాలన్న సుప్రీం ఆదేశాలను కేంద్రం తరఫు న్యాయవాది జస్టిస్‌ విభూ దృష్టికి తెచ్చారు. దాంతో విచారణను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేస్తూ జస్టిస్‌ విభూ నిర్ణయం తీసుకున్నారు.  ‘పౌరసత్వం’పై నిరసనలు చేపట్టకూడదంటూ కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరులలో పోలీసులు ఆంక్షలు విధించారు. బెంగళూరులో గురువారం ఉదయం 6 నుంచి 21 అర్థరాత్రి వరకు అమల్లో ఉంటాయి.

దేశాన్ని మంటల్లోకి తోస్తున్నారు
కేంద్రంపై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ  
కోల్‌కతా: ‘దేశంలోని మంటలను ఆర్పాల్సింది పోయి.. దేశాన్ని మంటల్లోకి నెడుతున్నారు. ఇది మీ ఉద్యోగం కాదు’అని హోం మంత్రి అమిత్‌షాపై  బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ‘సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌..’అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు కానీ.. దేశంలోని ప్రతి ఒక్కరిని వినాశనాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. దేశం మంటల్లో కాలిపోకుండా చూడాలని అమిత్‌షాను కోరారు.దేశాన్ని మంటల్లోకి తోసేయడం మీ ఉద్యోగం కాదు.. కానీ మంటలు ఆర్పేయండి చాలు’అని ఎద్దేవా చేశారు. కోల్‌కతాలో కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top