తప్పు చేయనప్పుడు క్షమాపణలెందుకు; సుప్రీం సూటి ప్రశ్న

Supreme Court Reserved Tehelka founder Tarun Tejpal Case  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా సంచలన కథనాలను వెలుగులోకి తెచ్చిన తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌పై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసుల విచారణ చేపట్టిన సుప్రీం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. జస్టిస్‌ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట తేజ్‌పాల్ తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ‘నా క్లయింట్‌ సీనియర్‌ జర్నలిస్టు అయినందుకే అతన్ని లక్ష్యంగా చేసుకుని నిరాధార లైంగిక ఆరోపణలు చేశారు’అని వాదించారు.

‘హోటల్ లాబీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించండి. బాధితురాలు చెప్పిన దాంట్లో ఒక్క వాస్తవం కూడా లేదు. లిఫ్ట్‌లో వేధింపులకు గురిచేశారంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. తేజ్‌పాల్‌, సదరు జర్నలిస్టుపై  మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌ను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు. జరిగిన సంఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆరోపణలు తప్పు అని రుజువు అవుతాయి’ అన్నారు. వికాస్‌ సింగ్‌ ఆరోపణల్ని గోవా పోలీసుల తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఖండించారు. ఆయన చేస్తున్న ఆరోపణలు విచారణ అనర్హమన్నారు. వాద ప్రతివాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును రిజర్వులో ఉంచింది.

అంతకు ముందు సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక ఆరోపణలు నిరాధారమే అయితే తేజ్‌పాల్‌ బాధితురాలికి ఎందుకు క్షమాపణలు చెప్పాడని ప్రశ్నించింది. ‘ఏమీ జరగకపోతే, మీరు క్షమాపణలు చెప్పేవారు కాదు. ఆరు సంవత్సరాల కిత్రం జరిగిన ఘటనపై క్షమాపణలు కోరుతూ ఇప్పుడు లేఖ పంపించారు. దానికి కారణాలేంటో తెలియాలి. ఈ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది’అని కోర్టు అభిప్రాయపడింది.

కేసు పూర్వపరాలు..
గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్‌లో తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ తనపై లైంగిక దాడికి యత్నించాడని అదే సంస్థలో పనిచేసే ఓ మహిళా జర్నలిస్టు ఆరోపించింది. 2013లో వెలుగుచూసిన ఈ ఘటన అప్పట్లో సంచలన రేకెత్తించింది. హోటల్‌ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ లైంగికంగా వేదింపులకు గురిచేశాడని బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎడిటర్ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉండనున్నట్లు తేజ్‌పాల్  షోమాకు ఈ-మెయిల్‌ పంపారు. 

అయితే తన చర్యపట్ల విచారం వ్యక్తం చేస్తూ బాధితురాలికి తేజ్‌పాల్ బేషరతుగా క్షమాపణ చెప్పాడని, దీనిపై బాధితురాలు సంతృప్తి వ్యక్తం చేసిందంటూ షోమా మీడియాకు చెప్పారు. బాధితురాలి కోరుకున్న న్యాయంకన్నా ఆయన ఎక్కువే చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనను సంస్థ అంతర్గత వ్యవహారంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. షోమా వ్యాఖ్యలపై ఎడిటర్స్ గిల్డ్ సహా జర్నలిస్టు సంఘాలు అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తేజ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేయడమేగాక ఘటనపై గోవాలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. 

గోవాలోనే ఉండి విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. దీంతో తనని అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. 2001లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ లక్ష రూపాయలు ముడుపులు తీసుకోవడాన్ని తేజ్‌పాల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టడం దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top