విస్తృత ధర్మాసనానికి ‘శబరిమల’ | Sabarimala temple case referred to larger Supreme Court bench of 7 judges | Sakshi
Sakshi News home page

విస్తృత ధర్మాసనానికి ‘శబరిమల’

Nov 15 2019 2:50 AM | Updated on Nov 15 2019 8:19 AM

Sabarimala temple case referred to larger Supreme Court bench of 7 judges - Sakshi

శబరిమల అంశం మతపరమైన ఆచారాలు, విశ్వాసాలకు సంబం ధించి అనేక ప్రశ్నలు లేవనెత్తింది.  ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడం అంటే, సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థం. మతపరమైన ప్రార్థన స్థలాల్లోకి మహిళలను నిరాకరించే విషయం శబరిమల ఆలయానికి మాత్రమే పరిమితం కాదు. అది ఇతర మతాల అంశాలకూ వర్తిస్తుంది.

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం అంశాన్ని.. సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళలోని ఈ ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం గతేడాది తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃపరిశీలించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సమీక్షించిన సుప్రీంకోర్టు.. ఈ అంశాన్ని విస్తృత స్థాయి ధర్మాసనానికి అప్పగించింది. శబరిమల  వంటి అంశం హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదన్న కోర్టు.. ముస్లిం, పార్శీ మహిళలపై ఆయా మతాల్లో కొనసాగుతున్న వివక్షనూ పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.

న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు, అమ్మాయిల ప్రవేశం అంశాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి అప్పగించింది. దశాబ్దాలుగా అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పునిచ్చింది. ఈ తీర్పుని పునః పరిశీలించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సమీక్షించిన కోర్టు ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి బదిలీ చేసింది.

ఈ సందర్భంగా శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తే అది ఒక్క హిందూ మహిళలకే పరిమితంకాదని, ముస్లిం, పార్శీ మహిళలపై ఆయా మతాల్లో జరుగుతున్న వివక్షనూ పరిశీలిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ముస్లిం మహిళలను మసీదు, దర్గాలోకి అనుమతించకపోవడం, పార్శీ మహిళలు.. పార్శీయేతర పురుషులను పెళ్లాడటంపై నిషేధం, బొహ్రా వర్గాల్లో జరుగుతున్న జనన అవయవాల కత్తిరింపుల్లాంటి అంశాలను విస్తృతధర్మాసనం చర్చిస్తుందని కోర్టు పేర్కొంది.

సంపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టు ఈ అంశాలపై న్యాయవిధానాలను రూపొందించాల్సిన సమయం ఇదేనని తన తొమ్మిదిపేజీల తీర్పుని వెలువరిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత తీర్పుపై స్టే ఇవ్వాలన్న అంశంపై స్పందిస్తూ విస్తృత ధర్మాసనానికి ఈ అంశాన్ని బదిలీ చేయడం అంటే సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థమని సీజేఐ రంజన్‌ గొగోయ్‌ వ్యాఖ్యానించారు. జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ నారీమన్, జస్టిస్‌ ఖన్వీల్కర్, జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ ఇందు మల్హోత్రాల ధర్మాసనం శబరిమల వివాదాన్ని పునఃపరిశీలించే అంశాన్ని 3:2 మెజార్టీ తీర్పుతో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.

అయితే 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు అమలుకాకుండా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అంశాన్ని ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఆమోదించినా, అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పుని సమీక్షించాలని కోరడాన్ని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లు విభేదించారు. సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్‌ తీర్పు అనంతరం దాఖలైన 65 పిటిషన్లు, 56 రివ్యూ పిటిషన్లు, కొత్తగా దాఖలైన నాలుగు రిట్‌ పిటిషన్లు, ఐదు అప్పీళ్ళను డిస్‌మిస్‌ చేయడాన్ని ఈ ఇద్దరు న్యాయమూర్తులు వ్యతిరేకించారు.

శబరిమల ఒక్కటే కాదు..
చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తన తరఫున, జస్టిస్‌ ఎఎం. ఖన్వీల్కర్, ఇందు మల్హోత్రాల తరఫున తీర్పుని చదివి వినిపిస్తూ ఈ అంశం మతపరమైన ఆచారాలూ, విశ్వాసాలకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తిందన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం శబరిమలలాంటి మతపరమైన ప్రార్థనా స్థలాలపై ఒకే రకమైన విధానాలను రూపొందించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ‘మతపరమైన ప్రార్థనాస్థలాల్లోనికి మహిళలను నిరాకరించే విషయం కేవలం శబరిమల ఆలయానికి మాత్రమే పరిమితం కాదనీ. ఇది ఇతర మతాల అంశాలకు వర్తిస్తుంది’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

2018 సెప్టెంబర్‌ తీర్పు ఏం చెప్పింది?
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ధర్మాసనం 4ః1 సభ్యుల ఆమోదంతో తీర్పునిచ్చింది. రుతుక్రమం వయస్సులో ఉండే మహిళలు, అమ్మాయి లను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని సమానత్వ భావనకు భిన్నమైనదని వ్యాఖ్యానించింది. ఈ యేడాది ఫిబ్రవరిలో చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ శబరిమల తీర్పుని రిజర్వ్‌లో ఉంచడం తెల్సిందే.

తీర్పుకి వ్యతిరేకంగా నాడు వెల్లువెత్తిన నిరసనలు
కేరళలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ సుప్రీంతీర్పు(2018)కి వ్యతిరేకంగా నాడు హిందూత్వవాదులు, సంఘ్‌పరివార్‌ లాంటి సంస్థలు పెద్దఎత్తున నిరసన తెలిపాయి. 10 నుంచి 50 ఏళ్ళలోపు వయస్సు మహిళలు అనేక మంది శబరిమల ఆలయప్రవేశానికి ప్రయత్నించారు. కొందరు సఫలమయ్యారు. మరికొందరు వెనుతిరగాల్సి వచ్చింది. అయ్యప్ప భక్తుల కోసం ఈనెల 17న దేవాలయాన్ని తెరవనున్నారు. దేవాలయం తెరుచుకోవడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ తీర్పు రావడంతో  ఆలయంలోకి ప్రవేశంపై సందిగ్ధత నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement