చెన్నైలో 11 అంతస్థుల భవనం కూలిన ఘటనలో బాధితులను తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.
తమిళనాడు ప్రభుత్వానికి చంద్రబాబు వినతి
హైదరాబాద్: చెన్నైలో 11 అంతస్థుల భవనం కూలిన ఘటనలో బాధితులను తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. శిథిలాల్లో రాష్ట్రానికి చెందిన కార్మికులు చాలామంది చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో చంద్రబాబు శనివారం హుటాహుటిన అధికారులతో భేటీ అయ్యారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శితో, భవనం ప్రాంతానికి చెందిన కలెక్టర్‌తో మాట్లాడాలని ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావును ఆదేశించారు. సీఎస్ వెంటనే తమిళనాడు ప్రభుత్వంతో చర్చించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో విజయనగరం దత్తరాజేరు, సాలూరు, మక్కువ మండలాలకు చెందిన వారు చిక్కుకున్నట్లు తెలిసిందని..
సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరామని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. ‘‘మొత్తం 14 మంది ప్రమాదంలో చిక్కుకున్నట్లు నిర్ధారిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలను రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. చెన్నైలో భవనం కూలి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు కార్మికులు చిక్కుకొని గాయపడడంపై కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు.