
సాక్షి, బెంగళూరు: 18వ శతాబ్దానికి చెందిన మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ యుద్ధ వీరుడనీ, ఆయనది వీర మరణంఅని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. కర్ణాటక విధాన సౌధ భవనాన్ని ప్రారంభించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాల్లో ఆ రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి రామ్‌నాథ్ ప్రసంగించారు. ‘టిప్పు బ్రిటిష్ వారితో పోరాడుతూ వీరమరణం పొందారు. మైసూరు రాకెట్లను అభివృద్ధి చేయడంలోనూ, కదన రంగంలో వాటిని ఉపయోగించడంలోనూ ఆయన మార్గదర్శకుడిగా నిలిచారు. ఈ సాంకేతికతను తర్వాత ఐరోపావారు సొంతం చేసుకున్నారు’ అని రామ్‌నాథ్ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. కోవింద్ ఉపన్యాసంలో టిప్పు పేరును చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని తన స్వార్థానికి వాడుకుని దుర్వినియోగం చేసిందని శాసన మండలిలో ప్రతిపక్ష బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. ఇలా మాట్లాడటానికి బీజేపీకి సిగ్గుండాలనీ ఆ ప్రసంగం స్వయంగా రాష్ట్రపతి కార్యాలయమే తయారు చేసింది తప్ప తాము కాదని రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు దినేశ్ గుండురావు చెప్పారు. ఎవరో రాసిచ్చిన దాన్ని రామ్‌నాథ్ ప్రసంగంగా చదివారని బీజేపీ అనడం, రాష్ట్రపతిని, ఆయన కార్యాలయాన్ని అవమానించడమేనని గుండురావు విమర్శించారు. నవంబర్ 10న టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించగా, బీజేపీ వ్యతిరేకిస్తుండటం తెలిసిందే.
ఆ ‘డీ’ ఉంటేనే ప్రజాస్వామ్యానికి సార్థకత
చట్ట సభల్లో మూడు ‘డీ’లు అయిన డిబేట్ (చర్చ), డిస్సెంట్ (భిన్నాభిప్రాయం), డిసైడ్ (నిర్ణయం)తోపాటు నాలుగో డీ అయిన డీసెన్సీ (సభ్యత) కూడా ఉంటేనే ప్రజాస్వామ్యానికి సార్థకత ఉన్నట్లని కోవింద్ పేర్కొన్నారు. ఎటువంటి భేదాలు లేకుండా ప్రజలందరి కోరికలు, ఆశలకు ప్రతిరూపాలుగా నిలిచేవే చట్ట సభలని అన్నారు.